పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ కి తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఇప్పటిదాకా ఎన్ని సీజన్స్ ప్రసారం అయ్యిందో.. అన్ని సీజన్స్ ని.. అందరు కంటెస్టెంట్స్ ని ఆదరిస్తూ వచ్చారు ప్రేక్షకులు. అయితే.. బిగ్ బాస్ షో ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ.. ఎప్పటికప్పుడు దీనిపై వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎంతోమంది ప్రముఖులు ఈ షో ఆపేయాలని.. షోలో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారంటూ కేసులు వేశారు. వాటి గురించి న్యాయస్థానాలు కూడా విచారణ చేస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ షోకి సంబంధించి కొత్త సీజన్.. 7వ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీ హైకోర్టు బిగ్ బాస్ షోపై సీరియస్ అయ్యింది.
బిగ్ బాస్ షో ప్రసారం చేసేముందు ప్రోగ్రాంని ఒకసారి అయినా సెన్సార్ షిప్ చేయకపోతే ఎలాగంటూ నిర్వాహకులను ప్రశ్నించింది. ఒకవేళ షో ప్రసారం అయిపోయాక దానిపై అభ్యంతరాలు వెలువడితే.. అంతా అయ్యాక పోస్ట్ మార్టం చేసినట్టు ఉంటుందని చెప్పింది ధర్మాసనం. అలాగే ప్రస్తుతం షో నడవట్లేదు కదా అని.. కోర్టు కళ్లు మూసుకొని ఉండదంటూ తెలిపింది. రీసెంట్ గా బిగ్ బాస్ షో అశ్లీలతను ప్రోత్సహించే విధంగా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పిల్స్ దాఖలు చేశారు. ఆయన వేసిన రెండు పిల్స్ పై హైకోర్టు విచారణ జరిపింది. సెన్సార్ లేకుండానే షో రన్ చేస్తున్నారంటూ పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. అలాగే షోని రాత్రి 11 నుండి మార్నింగ్ 5 లోపల ప్రసారం చేయాలని కోరారు.
ఇక బిగ్ బాస్ షో స్ట్రీమింగ్ మొదలయ్యే ముందు సెన్సార్ షిప్ విధానం ఇప్పటిదాకా లేదని ప్రతివాది తరఫు లాయర్ తెలిపారు. ప్రసారం అయ్యాక కూడా ఫిర్యాదులు తెలుపవచ్చు అని.. ఆ ఫిర్యాదులను పరిశీలన చేసేందుకు.. కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ చట్టం ఉందని అవతల న్యాయవాది వాదించారు. అంతేగాక ముందే సెన్సార్ షిప్ చేయాలనుకుంటే కేంద్రం చట్టం చేయాల్సి ఉంటుందని కోర్టు ముందు ప్రస్తావన తెచ్చారు. బిగ్ బాస్ నచ్చకపోతే టీవీ ఛానల్ మార్చుకోవచ్చని.. భావవ్యక్తీకరణ హక్కును వద్దు అనడానికి వీల్లేదని తెలిపారు. ప్రసారం అయిపోయాక ఫిర్యాదులపై చర్యలు తీసుకొని ఏం ప్రయోజనం. అశ్లీలతతో టీవీ ఛానల్ లో ప్రసారం చేస్తే దాన్ని చూస్తూ ఊరుకోవాలా? అని కోర్టు మండిపడింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తో పాటూ సంబంధిత ఛానల్, బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్, సినీ హీరో అక్కినేని నాగార్జునలను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. మరి బిగ్ బాస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.