iDreamPost
iDreamPost
2022లో భారతీయ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని అమెజాన్ ప్రైమ్ భారీ ఎత్తున కంటెంట్ ని సిద్ధం చేస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వబోతోంది. మూడు రోజుల క్రితం ఎన్నడూ లేనివిధంగా దేశవ్యాప్తంగా మీడియాను ముంబైకి పిలిచి గ్రాండ్ ఈవెంట్ ద్వారా తమ ఓటిటి నుంచి రాబోతున్న రిలీజులన్నీ ప్రకటించడం ద్వారా తమ ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పేసింది. అన్ని కలిపితే వీటి మీద పెట్టుబడి ఎన్ని వందల కోట్లో చెప్పడం కష్టమే. అంత గ్రాండియర్ గా వాటిలో క్యాస్టింగ్, బ్యాక్ గ్రౌండ్స్ ఉన్నాయి. తనతో పోటీ అంటే అంత ఆషామాషీ కాదనేలా ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ కి ప్రైమ్ ఈ రకంగా హెచ్చరికలు చేసినట్టే.
వీటిలో నాగ చైతన్య డిజిటల్ డెబ్యూ చేస్తున్న దూత ఉంది. మీసకట్టుతో చాలా కొత్తగా ఉన్న చైతు మీద అప్పుడే అంచనాలు పెరుగుతున్నాయి. అమ్మూ అనే డైరెక్ట్ మూవీని ప్రైమ్ నిర్మిస్తోంది. బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ గా నిలిచిపోయిన ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ లకు మూడో సీజన్ రాబోతున్నాయి. పంచాయత్, ముంబై డైరీస్, పాతాళ్ లోక్ లు రెండో భాగం కోసం రెన్యూవల్ అయ్యాయి. ఇక థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నాక వచ్చే బాలీవుడ్ సినిమాల్లో పృథ్విరాజ్, పఠాన్, టైగర్ 3, రన్ వే 34, థాంక్ గాడ్, దృశ్యం 2, జయేష్ భాయ్ జోర్దార్, ఫోన్ బూత్, ఫక్ రే 3, హం హే కహా లాంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి.
ఇండియాలో ఓటిటి పరంగా నెంబర్ వన్ పొజిషన్ ని టార్గెట్ చేస్తున్న ప్రైమ్ దానికి తగ్గట్టే ఇన్నేసి సినిమాలు సిరీస్ లతో ఇంకో ఏడాది కాలంలో మరింత గట్టిగా దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఓటిటి హక్కులు పొందిన దక్షిణాది చిత్రాల పేర్లు మాత్రం రివీల్ చేయకపోవడం గమనార్హం. దీనికి విడిగా ఏదైనా వేడుక పెడతారేమో చూడాలి. ప్రస్తుతానికి ఆచార్య, అంటే సుందరానికి, సర్కారు వారి పాట లాంటివి దాని లిస్టులో ఉన్నాయి. థియేటర్ వ్యవస్థకు ధీటుగా ఎదుగుతున్న ఇంకా చెప్పాలంటే దానికి విపరీతమైన పోటీ ఇస్తున్న ప్రైమ్ లాంటి సంస్థలు నేరుగా ఫిలిం ప్రొడక్షన్ లో దిగడం చూస్తుంటే రాబోయే పరిణామాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి.