టాలీవుడ్ నుంచి తన క్రేజ్‌ను మాలీవుడ్, బాలీవుడ్‌కు పెంచుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఒకే ఒక్క సినిమాతో ఆయన నేషనల్ స్టార్ అయిపోయారు. ‘పుష్ప’ చిత్రంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన బన్నీని మళ్లీ వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప 2’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్‌కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పలు బిజినెస్‌లు స్టార్ట్ చేసిన బన్నీ.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్ డైరెక్ట్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోయినా తన మామ కోసం రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మామ అంటే జనసేనాని పవన్ కల్యాణ్ అనుకునేరు! కాదండోయ్.. తనకు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కోసం రాజకీయాల్లోకి వస్తున్నారట బన్నీ. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. నేతలు పర్సనల్‌గా తమ మైలేజీ పెంచుకునేందుకు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన అల్లుడు అల్లు అర్జున్‌కు ఉన్న సినీ గ్లామర్‌ను వాడుకునేందుకు చంద్రశేఖర్ రెడ్డి సిద్ధమయ్యారని రూమర్స్ వస్తున్నాయి.
పిల్లనిచ్చిన మామ కోసం బన్నీ కూడా సరే అన్నారని టాక్. నాగార్జున సాగర్ టికెట్ తనకు కన్ఫర్మ్ చేశారని బీఆర్ఎస్ శ్రేణులకు స్పష్టం చేస్తున్నారట కంచర్ల. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ప్రచారాన్ని మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌తో ఇప్పటి నుంచే ప్రచారం చేయించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 19న మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో కలసి అల్లు అర్జున్ నాగార్జున సాగర్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. కంచర్ల 2014 ఎలక్షన్స్‌లో ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.