పక్షవాతం వస్తుందని చెప్పినా అజిత్ సినిమాలు చేస్తున్నాడు: అబ్బాస్

  • Author singhj Published - 07:08 PM, Mon - 7 August 23
  • Author singhj Published - 07:08 PM, Mon - 7 August 23
పక్షవాతం వస్తుందని చెప్పినా అజిత్ సినిమాలు చేస్తున్నాడు: అబ్బాస్

సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ప్రతిభతో పాటు కాసింత అదృష్టం కూడా కలసిరావాలి. వచ్చిన ఛాన్సులను సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. సినిమా సినిమాకు మరింత ఎఫర్ట్ పెడుతూ ఆడియెన్స్​ మనసుల్ని దోచుకోవాలి. కాలం కలిసొస్తే స్టార్​డమ్ వచ్చి, ఫ్యాన్ బేస్ ఏర్పడితే ఇక తిరుగుండదు. ఇలా ఒక్కో చిత్రంతో తమ అభిమాన గణాన్ని పెంచుకుంటూ, సక్సెస్​లు కొడుతూ స్టార్లుగా మారిన వాళ్లను చూస్తూనే ఉన్నాం. అదే టైమ్​లో ఒకట్రెండు హిట్స్​తో ఓవర్​నైట్ స్టార్లుగా మారి.. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక రేసులో వెనుకబడి, కనుమరుగైన వాళ్లనూ చూస్తున్నాం.

‘ప్రేమదేశం’ సినిమాతో అప్పట్లో యూత్​లో ఫుల్ పాపులారిటీ సంపాదించిన హీరో అబ్బాస్ ఇలాగే కనుమరుగయ్యారు. ఆ చిత్రంతో ఆయన ఓవర్​నైట్ స్టార్ అయిపోయారు. అప్పట్లో అబ్బాస్ కటింగ్ కోసం సెలూన్ షాపుల ముందు యూత్ క్యూ కట్టేవారు. అయితే రొమాంటిక్ హీరోగా రాణిస్తాడనుకున్న అబ్బాస్ కెరీర్​కు ఆ తర్వాత కొన్ని సినిమాలతోనే ఫుల్​స్టాప్ పడిపోయింది. దీంతో చేసేదేమీ లేక కుటుంబం కోసం సహాయక పాత్రల్లో నటిస్తూ కెరీర్​ను కొనసాగించారు. అలా అబ్బాస్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలవలేదు. అనంతరం తన కుటుంబంతో కలసి న్యూజిలాండ్​కు వెళ్లి అక్కడ కొత్త లైఫ్​ను మొదలుపెట్టారు.

స్వదేశంలో స్టార్​గా వెలుగొందిన అబ్బాస్.. విదేశాల్లో ఓ సాధారణ వ్యక్తిగా జీవించారు. అక్కడి పెట్రోల్ బంకుల్లో వర్క్ చేస్తూ, ట్యాక్సీలు నడుపుతూ బతికానని ఓ సందర్భంలో అబ్బాస్ బాహాటంగానే చెప్పారు. తాజాగా భారత్​కు తిరిగొచ్చిన అబ్బాస్.. కోలీవుడ్ హీరోల గురించి చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అజిత్​తో పాటు విజయ్, సూర్య, విశాల్ గురించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. దళపతి విజయ్ మృదుస్వభావి అని.. ఇప్పటికీ డౌన్ టు ఎర్త్​గా ఉంటాడని అబ్బాస్ అన్నారు. ఆయన అతి చేయడని.. మంచి హాస్యం కలవాడని మెచ్చుకున్నారు. సినిమాల ఎంపిక విషయంలో హీరో సూర్య అద్భుతమని.. ఆయనకు పనిపై ఉన్న చిత్తశుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు అబ్బాస్.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విషయంలో విశాల్​తో తనకు గొడవ జరిగిందని.. అయితే ఆయన్ను ఎప్పుడో క్షమించానన్నారు అబ్బాస్. ఇక, అజిత్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు మంచి వ్యక్తిత్వం ఉందన్నారు అబ్బాస్. అజిత్ తన లాంటి వారేనన్నారు. అజిత్ ఏ విషయంపై అయినా మాట్లాడితే సూటిగా ప్రతిస్పందిస్తాడని అబ్బాస్ చెప్పుకొచ్చారు. ‘అజిత్ మూర్ఖత్వాన్ని అస్సలు సహించడు. ఏ హీరోలోనూ కనిపించని ఉత్సాహం ఆయనలో ఉంది. అజిత్​కు ఇప్పటికే ఎన్నో సర్జరీలు జరిగాయి. పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు హెచ్చరించినా ఫ్యాన్స్ కోసం ఆయన సినిమాలు చేస్తున్నాడు. అభిమానుల మీద ఆయనకు ఎంతో అంకితభావం ఉంది. వాళ్ల ప్రేమే అజిత్​ను ముందుకు నడిపిస్తోంది’ అని అబ్బాస్ చెప్పుకొచ్చారు.

Show comments