Major Review మేజర్ రివ్యూ

ఒక సినిమాను ముందు రోజు ప్రీమియర్ వేయడానికే నిర్మాతలు టెన్షన్ పడుతున్న రోజుల్లో ఏకంగా వారం ముందే దేశవ్యాప్తంగా షోలు ప్రదర్శించడం ద్వారా మేజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి నుంచి తమ కంటెంట్ మీద నమ్మకంగా ఉన్న యూనిట్ మాటలు నిజమనేలా పూణే ముంబై తదితర చోట్ల దీన్ని చూసిన ఆడియన్స్ రియాక్షన్స్ కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం కొన్ని గంటల ముందు మాత్రమే స్క్రీనింగ్ చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజ జీవిత  కథ ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ కం పాట్రియాటిక్ డ్రామా నిజంగా అంత గొప్పగా ఉందా, అతని పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించిందా రివ్యూలో చూద్దాం

కథ

సందీప్(అడవి శేష్)కు చిన్నప్పటి నుంచి సోల్జర్ అవ్వాలనేది లక్ష్యం. తండ్రి(ప్రకాష్ రాజ్)కి ఇష్టం లేకపోయినా స్వంతంగా ప్రయత్నాలు చేసి ఆర్మీలో చేరతాడు. శిక్షణ తీసుకోవడానికి ముందే తన క్లాస్ మేట్ ఈషా(సయీ మంజ్రేకర్)ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాక క్యాంప్ కు వెళ్ళిపోతాడు. ఎన్ఎస్జిలో ట్రైనింగ్ ఇచ్చే స్పెషల్ ఆఫీసర్ గా చేరాక పాకిస్థాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు ముంబై మీద దాడి చేసి అకారణంగా వందల మందిని పొట్టనపెట్టుకుంటారు. సుప్రసిద్ధ తాజ్ హోటల్ ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. తాను వెళ్లకుండా సేఫ్ అయ్యే అవకాశం ఉన్నా సందీప్ ప్రాణాలకు తెగించి వెళ్తాడు. ఆ తర్వాత జరిగేదే అసలు స్టోరీ

నటీనటులు

బోలెడు సినిమాలు చేసే అవకాశాలు ఆఫర్లు ఉన్నా చాలా సెలెక్టివ్ గా ఉంటున్న అడవి శేష్ టేస్ట్ ని మెచ్చుకునే తీరాలి. కౌంట్ కంటే ఎక్కువ క్వాలిటీ కంటెంట్ కి ఇస్తున్న ప్రాధాన్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇలాంటి ఆలోచనా ధోరణి అందరికీ ఉండాలని కాదు కానీ మూసకు దూరంగా వెళ్లాలనుకునే ఇలాంటి వాళ్ళు కొందరైనా పరిశ్రమకు అవసరం. ఉన్ని కృష్ణన్ గా శేష్ పూర్తిగా పరకాయప్రవేశం చేశాడు. ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోదగ్గ మెరుపులేం లేవు కాబట్టి అక్కడ రొటీన్ గా అనిపిస్తాడు కానీ సెకండ్ హాఫ్ లో హోటల్ లో అడుగు పెట్టాక నిజమైన సైనికుడిగా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అతని వన్ అఫ్ ది కెరీర్ బెస్ట్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

హీరోయిన్ సయీ మంజ్రేకర్ కి చెప్పుకోదగ్గ స్కోపే దక్కింది. ఎక్స్ ప్రెషన్లు బాగానే పలికించింది. రొమాంటిక్ సీన్స్ లోనూ కాస్త డల్ గా కనిపించడం మినహాయిస్తే ఓవరాల్ గా ఓకే. చాలా గ్యాప్ తర్వాత రేవతి గారు తల్లి పాత్రలో కనిపించడం బాగుంది. ప్రకాష్ రాజ్ ఎన్నోసార్లు చేసిన క్యారెక్టరే అయినా ఇందులో గౌరవంతో కూడిన హుందాతనం ఉండటంతో ఇంకా బాగా పండింది. అనీష్ కురువిల్లా కొన్ని సీన్లకే పరిమితం. శోభిత ధూళిపాళ స్క్రీన్ ప్రెజెన్స్ ఫీలవ్వొచ్చు. మురళీశర్మ ఎన్ఎస్జి ఆఫీసర్ గా డ్రెస్ లో కొత్తగా కనిపించడంతో పాటు సౌండ్ తగ్గించి హుందాగా చేశారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కానీ టెర్రరిస్టుల బ్యాచ్ ని నీట్ గా సెట్ చేశారు.

డైరెక్టర్ అండ్ టీమ్

ఇండియా మీద జరిగిన బిగ్గెస్ట్ ట్రాజిక్ ఎటాక్స్ లో ఒకటిగా చెప్పుకునే 26/11 ఉదంతం జరిగి దశాబ్దం దాటినా దాని తాలూకు విషాద నీడలను ఇప్పటికీ మనం ఫీలవుతున్నామంటే దానికి కారణం అన్యాయంగా గాలిలో కలిసిపోయిన వందలాది ప్రాణాలు. అందులో ముష్కరులకు ఎదురొడ్డి పోరాడిన ఎందరో ఆఫీసర్ల కథలు వ్యధలు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రయత్నం చేసిన అడవి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క, మహేష్ బాబుతో పాటు ఇతర నిర్మాతలు అందరూ ప్రశంసలకు అర్హులే. ఇప్పటి జెనరేషన్ స్ఫూర్తి చెందడానికి ఇలాంటివి ఖచ్చితంగా ఉపయోగపడతాయి.

మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ని చేయడం మంచి ఆలోచనే. కానీ ఆశయం ఎంత గొప్పదైనా దాన్ని సినిమా రూపంలో చెబుతున్నప్పుడు కొన్ని పరిమితులు దాటాలి, కొన్ని పరిధులు గుర్తించాలి, కొన్ని సూత్రాలు పాటించాలి. ఎందుకంటే ఇది వెండితెరపై డబ్బులు తీసుకుని ప్రదర్శించే దృశ్యరూపం ప్రేక్షకులకంటూ ప్రత్యేకంగా కొన్ని అంచనాలుంటాయి. వాటికి ఎవరైనా సరే లోబడాల్సిందే. శశికిరణ్ తిక్క కూడా అదే చేశారు. అందుకే మొదటి ముప్పాతిక గంట అవసరమే లేని లవ్ స్టోరీని ఎమోషనల్ ఎస్టాబ్లిష్ మెంట్ పేరుతో సాగదీసే ప్రయత్నం చేయడం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అసలు కథ ఎప్పుడు వస్తుందాని ఎదురు చూసేలా చేసింది.

ఎంత పోరాటయోధుడైనా సందీప్ మనలాంటి మనిషే. తనకూ ప్రేమ, కుటుంబం, బాధ్యతలు ఉంటాయి. వాటిని చూపించాలి. తప్పు కాదు. కానీ అందులో ఎలాంటి డ్రామా లేకుండా చాలా ఫ్లాట్ గా తీసుకెళ్లడం ద్వారా కామన్ ఆడియన్స్ కి ఒకరకమైన బోర్ అనిపించే రిస్క్ ఫస్ట్ హాఫ్ లో కనిపించింది. శేష్ సయీల మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా మాములుగా అనిపిస్తాయి. కాస్త కొత్తదనం ఉన్నా ఇంకా బెటర్ మెంట్ ఉండేది. ఎలాగూ టైటిల్స్ కి ముందు డిస్ క్లైమర్ లో కొన్ని కల్పనలు జోడించాం అని చెప్పినప్పుడు ఆ అవకాశాన్ని ఇక్కడా వాడుకుని ఉంటే  బాగుండేది. క్రియేటివిటీకి అభూతకల్పనలు అవసరం లేదు. కానీ తగిన మోతాదులో కల్పనలు కావాలి

ఉదాహరణకు తన ప్రియురాలిని ఫలానా సందర్భంలో లిప్ లాక్ చేశానని నిజ జీవితంలో సందీప్ ఎవరికీ చెప్పలేదు. అతని తల్లితండ్రులు చెప్పి ఉండరు. అయినా ఆ సీన్ పెట్టారంటే వాళ్ళిద్దరి మధ్య బంధం ఎంత గాఢంగా ఉండేదో చెప్పడం కోసమేగా. అలాంటప్పుడు లవ్ ట్రాక్ ఇంకా లవ్లీగా ఉండాలి. ఇది పక్కనపెడితే ఇంటర్వెల్ బ్లాక్ ముందు సందీప్ మిషన్ కు వెళ్లేముందు వరకు మేజర్ లో వేగం ఉండదు. తక్కువ పాత్రల మధ్య సంభాషణలతో అలా అలా నెట్టుకొచ్చారు తప్ప కంటెంట్ స్ట్రాంగ్ గా లేదు. ఆర్మీలో చేరే క్రమం, అక్కడి నుంచి అతను ముంబై వెళ్లే ప్రాసెస్ ఇదంతా హడావిడిగా జరిగిపోయింది. ఎగ్జైట్ మెంట్ లేదు.

ఒక్కసారి అసలు కథలోకి ప్రవేశించాక వేగం పెరుగుతుంది. ఇదే బ్యాక్ డ్రాప్ లో గతంలో వచ్చిన హోటల్ ముంబై, ది ఎటాక్స్ అఫ్ 26/11, స్టేట్ అఫ్ సీజ్ 26/11 లాంటి సినిమాలు సిరీస్ లు గుర్తొస్తూనే ఉంటాయి. వాటిని చూడకపోతే ఎలాంటి ఇబ్బంది లేదు. యాక్షన్ బ్లాక్స్ మంచి కిక్ ఇస్తాయి. అలా కాకుండా వాటిని గతంలోనే చూసి ఉంటే మాత్రం మేజర్ ఫ్లో సాధారణంగా అనిపిస్తుంది. ఇంత సాహసం చేశారాని అక్కడక్కడా ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఇంత గొప్ప బ్రేవరీ మన ఎన్ఎస్జి లో ఉందానే ఎగ్జైట్ మెంట్ తక్కువగా ఉంటుంది. శశికిరణ్ పనితనం టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉంది. చాలా ఫ్రేమ్స్ లో ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అది కనిపిస్తుంది.

కొన్ని నిజాలు ఒప్పుకోవాలి. సందీప్ సాహసాన్ని గ్లోరిఫై చేసే క్రమంలో బందీల ఎమోషన్లు, ఉగ్రవాదుల పన్నాగాలు, అతని సహచరుల సహకారాలు లాంటి విషయాల పట్ల సీరియస్ గా దృష్టి పెట్టలేదు. అవి బ్యాలన్స్ అయ్యుంటే హోటల్ లో జరిగే ఎపిసోడ్స్ కి ఇంకా వెయిట్ పెరిగేది. థ్రిల్లింగ్ తో పాటు వావ్ ఫ్యాక్టర్ రెట్టింపయ్యేది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు పిల్లలు ఇంకా బలంగా కనెక్ట్ అయ్యేవారు. కథ సందీప్ కోణంలో చెప్పాలనుకున్నది నిజమే అయినప్పటికీ అవసరమైన ఇతర అంశాలకు చోటు కల్పించాల్సింది. హోటల్ ముంబై సినిమాలో వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లే అందులో డ్రామా హై లైట్ అయ్యింది.

ఇది సందీప్ ఉన్నికృష్ణన్ కు ఇచ్చిన చక్కని నివాళి. అందులో సందేహం లేదు. ఓసారి చూడొచ్చని చెప్పడంలో కూడా అనుమానం లేదు. బాలీవుడ్ లో ల్యాండ్ మార్క్ గా చెప్పుకునే బోర్డర్ సినిమాలో కూడా ప్రేమకథలు ఎమోషనల్ బ్లాక్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ గూస్ బంప్స్ ఇచ్చే టెర్రిఫిక్ యాక్షన్ ఎపిసోడ్స్ పండటం వల్ల జనం ఎగబడి చూశారు. మేజర్ అలా తీయాలని కాదు కానీ వావ్ ఫాక్టర్స్ ఇంకొన్ని ఉంటే చిన్న సెంటర్లలోనూ వసూళ్లు దక్కేవి. చివరి నలభై నిముషాలు మాత్రం మేజర్ కట్టిపడేస్తాడు. కన్నుమూసే ముందు, ఆ తర్వాత చూపించే భావోద్వేగాలు థియేటర్ బయటికి వస్తుండగా వెంటాడతాయి. ఆ భావనే మేజర్ ని రక్షించింది

శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం బాగుంది. సందర్భానికి తగినట్టు సాగింది. పాటలు అంతగా సింక్ అవ్వకపోవడంతో మళ్ళీ వినాలనిపించేలా లేవు. వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం గురించి నో కామెంట్స్. ఇచ్చి పడేశాడు. సునీల్ రోడ్రిక్స్ పోరాటాలు బాగా వచ్చాయి. వినయ్ కుమార్ – పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ మొదటిసగం ల్యాగ్ ని చూసుకుని ఉంటే బాగుండేది. అబ్బూరి రవి మాటలు అక్కడక్కడ మెరిపించాయి కానీ ఇలాంటి హై ఇంటెన్స్ డ్రామాకు తగినంత స్థాయిలో లేవు. సోనీ మహేష్ బాబుల నిర్మాణ భాగస్వామ్యంలో రాజీ అనే ప్రస్తావన కనిపించలేదు. సబ్జెక్టు డిమాండ్ మేరకు బడ్జెట్ భారీగానే ఖర్చు పెట్టారు

ప్లస్ గా అనిపించేవి

అడవి శేష్
సెకండ్ హాఫ్
క్లైమాక్స్ ఎమోషన్
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ గా తోచేవి

హీరోయిన్ ట్రాక్
ఫస్ట్ హాఫ్
మలుపులు బలంగా లేకపోవడం

కంక్లూజన్

ఏ సినిమా అయినా బేసిక్ గా వ్యాపారం. ఇక్కడ సానుభూతి సెంటిమెంట్లు గట్రా ఉండవు. ప్రేక్షకులకు నచ్చేలా ఎమోషన్ పండితే డాక్యుమెంటరీ తీసినా చాలు వందల కోట్లు కుమ్మరిస్తారని ది కాశ్మీర్ ఫైల్స్ తో ఋజువయ్యింది. కానీ అది బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని మతంతో కూడిన విషాదం కావడంతో సక్సెస్ అయ్యింది. కానీ మేజర్ లాంటివి రియల్ హీరోల ఎమోషనల్ స్టోరీలు. ఇలాంటివి ఓసారైనా చూడాలని చెప్పడం తప్పేమి కాదు. అవసరం కూడా. అలా కాకుండా మా సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కు ఫలానా మోతాదులో అంచనాలు ఉంటాయాంటే మాత్రం అవి పూర్తిగా రీచ్ కాకపోవచ్చు. సినిమా ఎలా ఉన్నా నిజమైన మేజర్ ఉన్నికృష్ణన్ కు మాత్రం ఖచ్చితంగా సెల్యూట్ కొట్టాలి.  అతన్ని తెరపై చూపించాలన్న ఈ మేజర్ టీమ్ సంకల్పాన్ని మెచ్చాలి

ఒక్క మాటలో – వన్ టైం మేజర్

రేటింగ్ – 2.75 / 5

Show comments