విలక్షణ నటుడు చంద్రమోహన్ లైఫ్ స్టోరీ!

తెలుగు ఇండస్ట్రీలో తనదైన కామెడీతో అందరినీ అలరించిన నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తే.. స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారని సెంటిమెంట్ ఉండేది.

తెలుగు ఇండస్ట్రీలో తనదైన కామెడీతో అందరినీ అలరించిన నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తే.. స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారని సెంటిమెంట్ ఉండేది.

ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమ అభిమాన నటీనటులు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. వారిని అభిమానించే అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోతున్నారు. వయోభారం, గుండెపోటు, రోడ్డు ప్రమాదాల కారణాల వల్ల సెలబ్రెటీలు చనిపోతున్నారు. మరికొంత మంది సెలబ్రెటీలు ఇండస్ట్రీలోకి ఎన్నో అశలు పెట్టుకొని వస్తే.. సరైన సక్సెస్ లేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొని డిప్రేషన్ లోకి వెళ్లి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ఏది ఏమైనా వెండితెరపై కోట్ల మంది ప్రేక్షకులను అలరించిన నటీనటులు కన్నుమూయడం సహ నటులు మాత్రమే కాదు.. అభిమానులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.  ప్రముఖ నటుడు చంద్రమోహన్ (82) హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయన తర్వాత ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. హీరోగా, క్యారెకట్ర్ ఆర్టిస్ట్ గా, తండ్రి పాత్రల్లో నటించి తన సత్తా చాటుకున్నారు. చంద్రమోహన్ ఒక్క అడుగు ఎత్తు ఉంటే.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా వెలిగిపోయి ఉండేవారు అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ ఉండేదని అంటారు. అయినప్పటికీ ఆయన కెరీర్ కి ఏదీ అడ్డు రాలేదు.. ఎలాంటి పాత్రల్లో అయినా పరకాయప్రవేశం చేసినట్లు అద్భుతమైన నటనతో అందరి గుండెల్లో చెరగని ముద్ర వేశారు చంద్రమోహన్. ఇండస్ట్రీకి అడుగు పెట్టకముందు ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. కృష్ణా జిల్లాలోని పమిడి ముక్కల గ్రామంలో 1943, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. బీఎస్సీ పూర్తి చేసిన ఆయన కాలేజీ రోజుల్లో ఎన్నో నాటకాలు వేశారు. చదువు పూర్తి కాగానే ఏలూరులో అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేసుకుంటూనే నాటకాలు వేసేవారు.

చంద్రమోహన్ నాటకాలు వేస్తున్న సమయంలో ఆయనకు వెండితెరపై నటించాలని కోరిక ఉండేది. ఆ రోజు రానే వచ్చింది.. 1964లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తేనె మనసులు సినిమా కోసం నూతన నటీనటులు కావాలని ప్రకటన వేశారు. చంద్రమోహన్ తన ఫోటోలను మద్రాస్ కి పంపించారు. కొన్ని రోజుల తర్వాత మద్రాస్ కి రమ్మని ఆయనకు పిలుపు వచ్చింది. ఎంతో ఆశగా మద్రాస్ వెళ్లిన ఆయనకు నిరాశే మిగిలింది. తేనె మనసులు మూవీ కోసం కృష్ణ, సంధ్య లను సెలక్ట్ చేశారు. తర్వాత కన్నె వయసు మూవీ ఆడీషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని తన ఫోటోలను మళ్లీ పంపించారు. అప్పుడు కూడా ఛేదు అనుభవం ఎదురైంది. ఇక లాభం లేదనుకున్న ఆయన ఏలూరు వచ్చి తన ఉద్యోగం చేసుకున్నారు. అదే సమయంలో ఆయన తండ్రి మరణించారు.. దాంతో తల్లి చంద్రమోహన్ ని ఎక్కడికి పంపించలేదు. అంతేకాదు చంద్రమోహన్ ఇద్దరు సోదరీమణుల బాధ్యత ఆయనపై పడింది. తేనె మనసులు సినిమా కోసం పంపిన ఆడిషన్ ఫోటోలు బీఎన్ రెడ్డి చూసి చంద్రమోహన్ ని మద్రాస్ కి రమ్మన్నారు. కానీ ఆయన ఇష్టపడలేదు.. తాను విజయవాడకు వస్తున్నా అప్పుడు కలమన్నాడు బీఎన్ రెడ్డి. ఈ క్రమంలోనే తన బావతో కలిసి ఒక హూటల్ లో బీఎన్ రెడ్డిని కలిశారు. తర్వాత చంద్రమోహన్ ని స్క్రీన్ టెస్ట్ తో పాటు డైలాగ్ ఇచ్చారు. తన నటన, డైలాగ్ తో బీఎన్ రెడ్డిని మెప్పించారు చంద్రమోహన్.

మొత్తానికి చంద్రమోహన్ కల నెరవేరింది.. 1966 లో విడుదలైన ‘రంగులరాట్నం’ మూవీతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. తర్వాత మరుపు రాని కథ, బంగారు పిచ్చుక మూవీస్ లో నటించారు. ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోవడం ఇష్టం లేక కొన్ని రోజులు పస్తులు పడుకున్నారు.. పార్కుల్లో నిద్రపోయారు. అయినా పట్టు వదల కుండా చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చారు. ఆయన గురువు బీఎన్ రెడ్డి నువు హీరోగా తప్ప చిన్న చిన్న వేషాలు వేయొద్దు అని చెప్పడంతో అలాగే చేశారు. మొదట చంద్రమోహన్ ని హీరోగా పెట్టి సినిమాలు తీయాలని అనుకున్నప్పటికీ నిర్మాతలు వెనుకా ముందు ఆడేవారు. ఇక కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చి ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో హీరోగా నటించిన తర్వాత వరుసగా హీరో పాత్రల్లో నటించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ‘ఓ సీత కథ’సూపర్ హిట్ కావడమే కాదు.. చలన చిత్ర విభాగంలో నంది అవార్డు, ఫిల్మ్ ఫేర్ పురస్కారం గెలుచుకుంది. ఈ చిత్రం తాష్కెంట్ లో జరిగిన ఆసియా, ఆఫ్రికన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. 1977లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘పదహారేళ్ళ వయసు’ మూవీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో చంద్రమోహన్ సరసన శ్రీదేవి నటించింది. ఈ చిత్రంలో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకలు నీరాజనాలు పట్టారు.

కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’ మూవీలో నటించిన మంచి పేరు సంపాదించారు. అప్పట్లో ఈ మూవీ కమర్షియల్ హిట్ అయ్యింది.. ఒక ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమా తర్వాత కొత్తనీరు, రామ్ రాబర్ట్ రహీం, శుభోదయం, మూడు ముళ్ళు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇక 1986లో జంద్యాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘చంటబ్బాయి’ సినిమాలో నటించి కామెడీ పండించారు. తర్వాత జయమ్ము నిశ్చయమ్మురాలో నటించాడు. ఇక చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. చంద్రమోహన్ హీరోగా రాణిస్తున్న సమయంలో ఆయన పక్కన హీరోయిన్లుగా నటిస్తే స్టార్ హీరోయిన్లు గా ఎదుగుతారని ఒక సెంటిమెంట్ ఉండేది. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజు, చంద్రకళ ఇలా ఎంతోమంది హీరోయిన్లు ఆయనతో నటించి టాప్ రేంజ్ కి ఎదిగార. అలా ఆయన పక్కన 90వ దశకం నుంచి చంద్రమోహన్ సహాయ పాత్రల్లో నటించడం మొదలు పెట్టారు. చంద్రలేఖ, నిన్నే పెళ్లాడతా, ఇద్దరు మిత్రులు, ఆమె, గులాబీ లాంటి చిత్రాలతో పాటు ఎన్నో చిత్రాల్లో సహాయక నటుడిగా నటించారు. 2000 సంవత్సరంలో హీరో తండ్రి పాత్రల్లో నటించడం మొదలు పెట్టారు. ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వు, 7జి బృందావన్ కాలనీ లో ఆయన పాత్రకు మంచి పేరు వచ్చింది. చంద్రమోహన్

ఇండస్ట్రీలో చంద్రమోహన్ ఎంతో సౌమ్యుడిగా ఉండేవారు. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లేవారు కాదు. దాదాపు 932 సినిమాల్లో నటించారు. కెరీర్ లో ఆయన ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. రంగుల రాట్నం మూవీకి 1966లో ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది. 1978లో పదహారేళ్ల వయసు మూవీకి గాను ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. 1987లో చందమామ రావే మూవీకి ఉత్తమ కమెడియన్ అవార్డు, 2005లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘అతనొక్కడే’ మూవీకి అవార్డు వచ్చింది. ఒక నటుడు తన కెరీర్ లో ఎన్ని పాత్రలు చేయాలో అన్ని పాత్రలు చేసి సంపూర్ణ నటుడిగా పేరు తెచ్చకున్నారు చంద్రమోహన్. కోట్ల మందిని నవ్వించిన ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ సెలబ్రెటీలు, అభిమానులు భగవంతుడిని కోరుకుంటున్నారు.

Show comments