iDreamPost
android-app
ios-app

7/G రీ రిలీజ్! 20 ఏళ్ళ తరువాత కూడా ఇంత క్రేజ్ కి కారణం?

7/G రీ రిలీజ్! 20 ఏళ్ళ తరువాత కూడా ఇంత క్రేజ్ కి కారణం?

7/G బృందావన కాలనీ సినిమా పేరు గత కొద్దిరోజుల నుంచి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 2004లో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమా రీ రిలీజ్‌ చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్‌లో సినిమా చూడ్డానికి సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే సినిమా రీ రిలీజ్‌ అవుతున్న థియేటర్లు ఇప్పటికే హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. సినిమా వచ్చి 20 ఏళ్లు అవుతున్నా ఎందుకింత క్రేజ్‌! సినిమాలో అంత స్పెషాలిటీ ఏముంది?

ఇది సగటు మధ్య తరగతి యువకుడి ప్రేమ కథ!

ఈ సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్‌ తెరకెక్కించారు.  రవికృష్ణ, సోనియా అగర్వాల్‌లు హీరో, హీరోయిన్లుగా నటించారు. 2004, అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అప్పట్లో యూత్‌కు బాగా ఎక్కేసింది. సగటు మధ్య తరగతి యువకులందరూ హీరోలో తమను తాము చూసుకున్నారు. రవికృష్ణ, సోనియా అగర్వాల్‌లు నటించారు అనటం కంటే జీవించారు అని చెప్పటం బాగుంటుంది. 7/G బృందావన కాలనీ సినిమాలా కాకుండా ఓ నిజ జీవిత సంఘటనలా అందరి మనసుల్లో నిలిచిపోయింది.

కల్ట్‌ క్లాసిక్‌.. అన్నింటా మెప్పించింది!

ఈ సినిమాకు 20 ఏళ్ల తర్వాత కూడా ఇంత క్రేజ్‌ ఉండటానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో హైలెట్‌గా నిలిచేవి పాటలు. ప్రతీ పాట ఓ అందమైన ప్రేమ కావ్యంలా ఉంటుంది. పాటల రచయితలు మనసు పెట్టి ఈ పాటల్ని రాశారు. యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ సినిమాకు ప్రాణం పోసింది. ఫస్ట్‌ హాఫ్‌ మనల్ని బాగా నవ్విస్తే.. సెకండ్‌ హాఫ్‌ బాగా ఏడిపిస్తుంది. దర్శకుడు సెల్వ రాఘవన్‌ సినిమాకు విషాదకరమైన ఎండింగ్‌ ఇచ్చాడు. సినిమా అయిపోయిన తర్వాత గుండె బరువెక్కి భారంగా బయటకు రావాల్సి వస్తుంది.