iDreamPost
android-app
ios-app

పరాయి మగాళ్లను చూడొద్దు.. పాటలు పాడొద్దు.. మహిళలపై తాలిబన్ల ఆంక్షలు

  • Published Aug 26, 2024 | 3:59 PM Updated Updated Aug 26, 2024 | 3:59 PM

Ban On Women's Voice And bare Faces In Public: ప్రపంచమంతా రాతి యుగం నుంచి సాంకేతిక యుగం వైపు అడుగులు వేస్తుంటే కొన్ని దేశాలు మాత్రం మహిళల విషయంలో ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ దేశం కూడా మహిళల విషయంలో తీవ్ర ఆంక్షలు విధించింది.

Ban On Women's Voice And bare Faces In Public: ప్రపంచమంతా రాతి యుగం నుంచి సాంకేతిక యుగం వైపు అడుగులు వేస్తుంటే కొన్ని దేశాలు మాత్రం మహిళల విషయంలో ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ దేశం కూడా మహిళల విషయంలో తీవ్ర ఆంక్షలు విధించింది.

పరాయి మగాళ్లను చూడొద్దు.. పాటలు పాడొద్దు.. మహిళలపై తాలిబన్ల ఆంక్షలు

శతాబ్దాల పాటు అణచివేతకు, ఆంక్షలకు గురైన మహిళలు ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో పాటు సమానంగా ఉన్నతమైన హోదాల్లో సత్తా చాటుతున్నారు. మహిళల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు, సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వాలు ఆర్థిక శక్తిగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నాయి. చాలా దేశాల ప్రభుత్వాలు మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నాయి. మహిళల విషయంలో ఆయా దేశాలు ముందుకు వెళ్తుంటే.. ఆఫ్ఘనిస్తాన్ దేశం మాత్రం మళ్ళీ రాతియుగం నాటి కాలానికి వెళ్ళిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలపై ఆంక్షలు విధిస్తున్నారు. షరియా చట్టం పేరుతో మహిళలను అణచివేతకు గురి చేస్తున్నారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని తాలిబన్లు కూలగొట్టి ఆ దేశాన్ని ఆక్రమించుకుని పాలనను సాగిస్తున్నారు.

క్రూరమైన పాలనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన తాలిబన్లు.. అధికారంలోకి వస్తే అంతకు ముందులా క్రూరంగా ఉండమని ప్రపంచ దేశాలతో కలిసి వెళ్తామని అన్నారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మాట తప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్ల పాలనను పూర్తి చేసుకున్న తాలిబన్ల ప్రభుత్వం మహిళలపై ఆంక్షలు విధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టానికి తాలిబన్ అగ్రనేత హిబతుల్లా అఖుంద్ జాదా ఆమోదం తెలిపాడు. కొత్త చట్టం ప్రకారం.. మహిళలు బురఖా ధరించే విధానం, బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం వంటి వాటిపై ఆంక్షలు విధించబడతాయి. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగినప్పుడు ముఖంతో పాటు మొత్తం శరీరాన్ని కప్పుకోవాలి.

మహిళలు వేసుకునే బట్టలు సన్నగా, టైట్ గా, కురచగా ఉండకూడదు. అంతేకాదు మహిళలు బహిరంగంగా మాట్లాడడం, పాటలు పాడడం, కవితలు చదవడం, గట్టిగా మాట్లాడడం వంటివి చేయకూడదని అక్కడి తాలిబన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పురుషులను చూడకూడదని.. భర్తను, రక్త సంబంధం ఉన్న వారిని మాత్రమే చూడాలని.. మిగతా పురుషులను ఎవరినీ చూడకూడదని కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. పురుషులను రెచ్చగొట్టకుండా మహిళలు ముఖాన్ని కప్పి ఉంచాల్సిన అవసరం ఉందని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నాక మహిళలపై కొత్త ఆంక్షలు విధించడం ప్రారంభించారు.

అంతర్జాతీయ సమాజంలో మహిళలకు ఉన్నట్లు ఆఫ్ఘనిస్తాన్ మహిళలకు ఉండదని.. ప్రత్యేక హక్కులంటూ ఏమీ ఉండవని తాలిబన్లు కుండబద్దలు కొట్టి చెప్పేశారు. మహిళలందరూ షరియా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే అని హిబతుల్లా హెచ్చరికలు జారీ చేశాడు. అయితే మహిళలపై ఆంక్షలు విధించడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలపై విధించే ఆంక్షల వల్ల వారి జీవితాలు మరింత ఘోరంగా మారతాయని.. ఈ సమస్యను అంతర్జాతీయం సమాజం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ లోని మహిళల హక్కులకు సంబందించిన సమస్య మాత్రమే కాదని.. మానవ హక్కుల ఉల్లంఘన అని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.