Dharani
NASA-Sunita Williams Back In 2025: ఎనిమిది రోజుల టూర్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్.. మరో ఎనిమిది నెలల పాటు అక్కడే ఉండాల్సి రానుందని సమాచారం. ఆ వివరాలు..
NASA-Sunita Williams Back In 2025: ఎనిమిది రోజుల టూర్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్.. మరో ఎనిమిది నెలల పాటు అక్కడే ఉండాల్సి రానుందని సమాచారం. ఆ వివరాలు..
Dharani
అంతరిక్ష యాత్రం కోసం.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు వెళ్లిన భారత సంతతికి చెందని సునీతా విలియమ్స్.. అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సునీతా విలియమ్స్, విల్మోర్ రెండు నెలల క్రితం అనగా ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ లో ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. వీరి టూర్ వ్యవధి 8 రోజులు మాత్రమే. అంటే జూన్ 14న వీరు తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల సునీత, విల్మోర్ లు అక్కడే చిక్కుకుపోయారు. వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా అనేక ప్రయత్నాలు చేస్తుంది. కానీ అవేవి విజయవంతం కావడం లేదు. ఈ క్రమంలో తాజాగా మరో సంచలన విషయం తెలిసింది. సునీతా, విల్మోర్లు 2025, ఫిబ్రవరి వరకు ఐఎస్ఎస్ లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. 8 రోజుల టూర్ కోసం వెళ్లిన వీరు 8 నెలలు అక్కడే ఉండాల్సి రాబోతుంది. ఎందుకిలా జరిగింది.. అంటే..
సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లను ఐఎస్ఎస్‌కు తీసుకెళ్లిన స్టార్‌లైనర్ క్యాప్సుల్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీరు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ అక్కడే చిక్కుకుపోయింది. దాంతో వారు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయి తిరిగి భూమి మీద సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అవకాశం లేకుండాపోయింది.
ఇప్పుడు వారిని భూమ్మీదకు సురక్షితంగా రప్పించేందుకు నాసా ప్రత్యామ్నయ మార్గాలు చూస్తోంది. ఇందుకోసం స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకను ఐఎస్ఎస్‌కు పంపించి వారిని వెనక్కి రప్పించాలని నాసా ప్రయత్నాలు చేస్తోంది. అయితే వారు భూమ్మీదకు రావాలంటే 2025 ఫిబ్రవరిలో మాత్రమే వీలవుతుందని తాజాగా నాసా వెల్లడించింది. దాంతో వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఐఎస్‌ఎస్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో నింగిలోకి ప్రయోగించే అవకాశం ఉంది. ఈ వ్యోమనౌక ద్వారా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లను భూమి మీదకు తీసుకురావాలని నాసా ప్రణాళికలు రచిస్తోంది. అయితే వారిద్దరినీ స్టార్‌లైనర్‌లోనే భూమి మీదికి తీసుకురావాలా లేక క్రూ డ్రాగన్‌ను ఉపయోగించి తీసుకురావాలా అనే దానిపై నాసా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.