iDreamPost
android-app
ios-app

Sunita Williams: సునీతా విలియమ్స్‌ భూమిపైకి వచ్చేది ఎప్పుడు? ఎలాన్ మస్క్ సాయం దేనికి? పూర్తి వివరణ!

  • Published Jun 29, 2024 | 1:40 PM Updated Updated Jun 29, 2024 | 1:40 PM

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ముచ్చటగా మూడోసారి చేపట్టిన అంతరిక్ష యాత్రలో అనుకోని అంతరాయం ఏర్పడి.. ఆమె అక్కడే చిక్కుకుపోయారు. ఆమె భూమ్మీదకు తిరిగి ఎప్పుడు వస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ముచ్చటగా మూడోసారి చేపట్టిన అంతరిక్ష యాత్రలో అనుకోని అంతరాయం ఏర్పడి.. ఆమె అక్కడే చిక్కుకుపోయారు. ఆమె భూమ్మీదకు తిరిగి ఎప్పుడు వస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.

  • Published Jun 29, 2024 | 1:40 PMUpdated Jun 29, 2024 | 1:40 PM
Sunita Williams: సునీతా విలియమ్స్‌ భూమిపైకి వచ్చేది ఎప్పుడు? ఎలాన్ మస్క్ సాయం దేనికి? పూర్తి వివరణ!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌.. అంతరిక్షంలో ఇరుక్కుపోయారు. తిరిగి ఆమె భూమి మీదకు ఎప్పుడు వస్తుంది అనే దానిపై క్లారిటీ లేదు. ఈ నెల అనగా జూన్‌ 5న ఆమె మరో వ్యోమగామి బారీ విల్‌మోర్‌తో కలిసి.. బోయింగ్‌ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో.. అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌) కు వెళ్లారు. షెడ్యూల్‌ ప్రకారం వీరు జూన్‌ 14న భూమికి తిరిగి రావాలల్సి ఉంది. అయితే ఐఎస్‌ఎస్‌కు కనెక్ట్‌ అయి ఉన్న స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో వారి రాకకు ఆటంకం ఏర్పడింది. దాంతో జూన్‌ 26న వీరి తిరుగు ప్రయాణానికి రీషెడ్యూల్‌ వేశారు. కానీ మరోసారి తిరుగు ప్రయాణం వాయిదా పడింది. అందుకు కారణం సునీతా విలియమ్స్‌ ప్రయాణం చేసిన వ్యోమనౌకలో హీలియం గ్యాస్‌ లీకవుతున్నట్లు బోయింగ్‌, నాసా గుర్తించింది. దాంతో పాటు మరికొన్ని సమస్యలు రావడంతో ఆమె అక్కడే ఉండిపోయారు.

ప్రస్తుతం నాసా ఇంజనీర్లు, బోయింగ్‌ సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్‌ లీకేజ్‌ సమస్య వల్లే తిరుగు ప్రయాణం ఆలస్యం అయ్యిందని.. అందుకే జూన్‌ 26న ఈ ఇద్దరు వ్యోమగాములు తిరుగు పయనం అవుతారని నాసా చెప్పినా.. అది సాధ్యం కాలేదు. దాంతో వారి తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా పడింది. ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమ్మీదకు ఎప్పుడు వస్తారు అనే దానిపై నాసా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

గ్యాస్‌ లీకేజ్‌ని పట్టించుకోని నాసా..

అయితే మిషన్‌ ప్రయోగానికి ముందే వ్యోమనౌకలో హీలియం గ్యాస్‌ లీక్‌ అవుతుందని నాసాకు తెలుసనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాన్ని పెద్ద సమస్యగా భావించని నాసా.. సునీతా విలయమ్స్‌ను స్పేస్‌ టూర్‌కు పంపినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు స్టార్‌ లైన్‌ రాకెట్‌ ఇంధన సామర్థ్యం కేవలం 45 రోజులు మాత్రమే. ఇప్పటికే సునీతా విలియమ్స్‌ ఐఎస్‌ఎస్‌కు వెళ్లి.. 22 రోజులు పూర్తయ్యాయి. మరో 23 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈలోపు సునీతా విలియమ్స్‌.. భూమికి చేరుకోవాలి. లేదంటే ఆమె డేంజర్‌లో ఉన్నట్లే.

స్పేస్‌ ఎక్స్‌ సాయంతో భూమ్మీదకు..

అయితే అంతరిక్ష స్పేస్‌ కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలయమ్స్‌, విల్‌మోర్‌లను భూమ్మీదకు తీసుకురావడానికి ఎలాన్‌ మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌ సహకారం అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మార్చిలో నలుగురు వ్యోమగాలను ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లిన స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ అంతరిక్షంలో రెడీగా ఉంది. ఈ క్రమంలో స్టార్‌లైనర్‌ మరమ్మతులు గనక సమయానికి పూర్తి కాకపోతే.. మస్క్‌ క్రూ డ్రాగన్‌లోనే ఇద్దరు వ్యోమగాములు భూమ్మీదకు తిరుగు పయనం అవుతారని అంతర్జాతీయ సమాజంలో పెద్ద ఎత్తున​ చర్చ జరుగుతుంది. అయితే నాసా, బోయింగ్‌ అధికారులు మాత్రం ఇప్పటికైతే స్పేస్‌ ఎక్స్‌ సాయం అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరి తిరుగు ప్రయాణానికి కొత్త తేదీని ఇంకా ఖరారు చేయలేదు. కానీ అంతా అనుకున్నట్లు జరిగితే.. జూలై 2 లేదా 6న వీరు భూమ్మీద ల్యాండ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది అంటున్నారు.

వరుస ప్రమాదాలు.. బోయింగ్‌పై విమ్శరలు..

మరోవైపు సివిల్‌ ఏవియేషన్‌ ఫీల్డ్‌లో ఎంతో పేరున్న బోయింగ్‌ కంపెనీ.. వరుస ప్రమాదాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. 2018, 2019లో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. దాంతో పలు దేశాల్లో బోయింగ్‌ విమానాలను రద్దు చేశారు. లోపాలను సరి చేయడంతో.. 20 నెలల తర్వాత నిషేధాన్ని ఎత్తి వేశాయి ఏవియేషన్‌ కంపెనీలు. బోయింగ్‌ మిగతా విమానాల్లో కూడా తరచుగా ఏదో సమస్య తలెత్తుతుండటంతో.. ఆ కంపెనీ పేరు చెబితేనే ప్రయాణికులు భయపడుతున్నారు. ఇప్పుడు అంతరిక్షంలో సైతం బోయింగ్‌ వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరోసారి బోయింగ్‌పై చర్చ సాగుతోంది.

అదే జరిగితే స్పేస్‌ ఎక్స్‌దే పైచేయి..

ప్రస్తుతం సునీతా విలియమ్స్‌, బారీ విల్‌మోర్‌, మరో ఏడుగురు సిబ్బందితో పాటు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగా ఉన్నారని నాసా చెబుతోంది. సమస్య పరిష్కారం అయ్యి అన్నీ అనుకూలిస్తే.. వారు జూలై 2, 6న భూమ్మీద ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే వారు బోయింగ్‌లో వస్తారా.. లేదంటే మస్క్‌ క్రూ డ్రాగన్‌లో వస్తారే అనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. స్పేస్‌ ఎక్స్‌లోనే వస్తే.. బోయింగ్‌పై మస్క్‌ విజయం సాధించనట్లే అంటున్నారు.

సునీతా విలియమ్స్‌కు ఇది మూడో అంతరిక్ష యాత్ర కాగా.. 1998లో నాసాకు ఎంపికైన ఆమె తొలిసారి 2006లో రోదసి యాత్ర చేశారు. ఆ తర్వాత మరోసారి 2012లో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. అప్పుడు మొత్తం 50 గంటల 40 నిమిషాలు సునీతా స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు ఆమె స్పేస్‌లో గడిపారు. ఓ సారి స్పేస్‌లో మారథాన్ కూడా చేశారు సునీత విలియమ్స్‌. ఇక మూడోసారి స్పేస్‌ టూర్‌లో భాగంగా ఈ ఏడాది జూన్‌ 5న మరోసారి అంతరిక్ష స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లారు. కానీ తిరుగు ప్రయాణంలో అనుకోని సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ఆమె భూమ్మీదకు తిరిగి ఎప్పుడు వస్తుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.