iDreamPost
android-app
ios-app

ఆత్మలపై డాక్టర్‌ పరిశోధనలు.. వెలుగులోకి సంచలన విషయాలు!

ఆత్మలపై డాక్టర్‌ పరిశోధనలు.. వెలుగులోకి  సంచలన విషయాలు!

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి

అని భగవద్గీతలో ఓ శ్లోకం ఉంది. ‘‘ పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు’ అని దీనర్థం. అంటే మనిషి పుట్టిన తర్వాత చావటం.. చనిపోయిన తర్వాత మళ్లీ పుట్టడం జరుగుతుందని దాదాపు 5 వేల ఏళ్ల క్రితం శ్రీకృష్ణుడు చెప్పాడు.

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ ।
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్

అని కూడా భగవద్గీతలో మరో శ్లోకం ఉంది. ‘‘ ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, మరణం లేనిది, ఎన్నటికీ మార్పుచెందనిది అని తెలిసిన వ్యక్తి, ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు?’’ అన్నది దానర్థం. ప్రతీ మనిషిలోనూ ఓ ఆత్మ ఉంటుందని, అదే మనిషి చావు, పుట్టుకలను నిర్థేసిస్తుందని, మనిషికి చావు ఉంటుంది కానీ, ఆత్మకు చావు ఉండదని శ్రీకృష్ణుడు చెప్పాడు. అయితే, సైన్స్‌ పరంగా చూసుకుంటే.. చనిపోయిన తర్వాత మనిషి మళ్లీ పుడతాడన్న దానిపై ఎలాంటి ధ్రువీకరణ లేదు. మనిషికి ఆత్మ ఉన్నదన్న దానిపై కూడా సైన్స్‌ పరంగా ధ్రువీకరణ లేదు.

ఇలాంటి సమయంలో అమెరికాలోని కెంటకీకి చెందిన జెఫరీ అనే డాక్టర్‌ మరణం తర్వాత ఆత్మ ఏమౌతుందన్న దానిపై సుధీర్ఘ పరిశోధనలు చేసి సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. ఆయన నియర్‌ డెత్‌ ఎక్స్‌పీరియన్స్‌పై కొన్నేళ్ల పాటు పరిశోధనలు చేశారు. నియర్‌ డెత్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంటే.. మనిషి చావు అంచుల వరకు వెళ్లినపుడు.. అతడికి ఎదురైన అనుభవాలే ‘నియర్‌ డెత్‌ ఎక్స్‌పీరియన్స్‌’. డాక్టర్‌ జెఫరీ నియర్‌ డెత్‌ అనుభవాలను ఎదుర్కొన్న దాదాపు 5 వేల మందిపై పరిశోధనలు చేశారు.

వారి అనుభవాల ద్వారా.. ప్రతీ మనిషిలో ఆత్మ ఉంటుందని, చావు అంచుల వరకు వెళ్లిన తర్వాత ఆత్మ బయటకు వస్తుందని ఆయన కనుగొన్నాడు. వైద్య శాస్త్ర పరంగా చనిపోయారని ధ్రువీకరించబడ్డ వారి ఆత్మలు బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో విహరించాయని తెలుసుకున్నారు. ప్రతీ  నియర్‌ డెత్‌ ఎక్స్‌పీరియన్స్‌ భిన్నమైనదని.. కానీ, వాటన్నింటికి ఓ పద్ధతి ఉంటుందని జెఫరీ అంటున్నారు. దాదాపు 45 శాతం మంది పేషంట్లు తమ శరీరంనుంచి ఆత్మ వేరుపడిన అనుభవాలను పొందామని తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. చావు తర్వాత కూడా మరో జీవితం ఉందని ఆయన స్పష్టం చేశారు. మరి, మరణం తర్వాత జీవితం ఉందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.