చనిపోయినట్లు నటించినా వదల్లేదు.. గుర్తించి మరీ..

ఇజ్రాయేల్ పై హఠాత్తుగా హామాస్ మెరుపు దాడి చేయడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో రాకెట్ లాంచర్లతో దాడులు నిర్వహించడంతో అయోమయానికి గురైన ఇజ్రాయెల్ వెంటనే హమాస్ పై ఎదురుదాడికి దిగింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. వందల సంఖ్యలో చనిపోయారు.. గాయపడ్డారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. హమాస్ మిలిటెంట్లు అత్యంత పాశవికంగా ఇజ్రాయేల్ పౌరులపై దాడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇజ్రాయేల్ పౌరులపై హమాస్ మిలిటెంట్లు అత్యంత దారుణంగా దాడులకు తెగబడుతున్నారు. వీరి దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గాజా సరిహద్దులోని కిబ్బూజ్ రిమ్ వద్ద ఓ మ్యూజికల్ ఫెస్టివల్ జరుగుతుంది. హఠాత్తుగా హమాస్ ఉగ్రమూకలు మ్యూజికల్ ఫెస్టివల్ కి హాజరైన వారిపై విచక్షణారహితంగా మెరుపుదాడి చేశారు. మిలిటెంట్లకు భయపడి చాలా మంది చెట్ల పొదల్లో, ప్రహారి గొడల మాటున దాక్కొన్నారు. కానీ ఆ దుర్మార్గులు వారిని వెతికి మరీ కాల్చి చంపారు. కొంతమంది ప్రాణాలు పోయినట్లు నటించినా.. వారిని కనుక్కొని మరీ చంపారు.

ఇజ్రాయెల్ కి చెందిన ప్రముఖ టీవీ యాంకర్ మయాన్ ఆడమ్ చెల్లెలు మాపల్ ఆడమ్ (27) శనివారం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి నోవా మ్యూజికల్ ఫెస్టివల్ కి వెళ్లింది. ఆ సమయంలో హమాస్ మిలిటెంట్లు చుట్టు ముట్టి దారుణంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో మాపల్ ఆడమ్ తన బాయ్ ఫ్రెండ్ తో తప్పించుకుని ఓ ట్రక్కు కింద దాక్కుని చనిపోయినట్లు నటించారు. కానీ ముష్కరులు వారిని గుర్తించి దగ్గరికి వచ్చి శ్వాస ఉన్నట్లు కనుక్కొని మరీ కాల్పులు జరిపారు. ఈఘటనలో ఆడమ్ అక్కడిక్కడే మృతి చెందింది.. ఆమె బాయ్ ఫ్రెండ్ తీవ్రంగా గాయపడ్డాడు.

తాను చనిపోతానని భావించిన మాపల్ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ట్రక్కు నుంచి ఫోటోలు తీసి తన అక్కకు పంపించింది. మయాన్ ఆడమ్ ఆ ఫోటోలు ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ‘నా చెల్లెలు తీసిన చివరి ఫోటో.. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఊపిరి బిగబట్టి కొన్ని గంటల పాటు కదలకుండా ఉన్నా.. ముష్కరులు ఆమెను గుర్తించి అతి కిరాతకంగా హతమార్చారు’ అంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటన హమాస్ మిలిటెంట్ల అకృత్యాలకు అద్దం పడుతుంది. ఇప్పటికే హమాస్ జరిపిన దాడిలో 260 మందికి పైగా మరణించారు.

Show comments