Flash Floods: మెరుపు వరదలు.. ఒక్క రోజులో 300 మందికి పైగా మృత్యువాత

ప్రకృతి కన్నెర్ర జేస్తే ప్రళయం తప్పదు. భారీ వర్షాలు, అకాల వరదల కారణంగా 300 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.

ప్రకృతి కన్నెర్ర జేస్తే ప్రళయం తప్పదు. భారీ వర్షాలు, అకాల వరదల కారణంగా 300 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.

భారీ వర్షాలు, వరదలు ఆఫ్ఘనిస్తాన్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బదాక్షన్, ఘోర్, బఘ్లాన్, హెరాత్ ప్రావిన్సులో వరదలు బీభత్సం సృష్టించాయి. బఘ్లాన్ లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ ప్రాంతంలో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. 2 వేలకు పైగా ఇళ్ళు ధ్వంసమయ్యాయని.. 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బఘ్లాన్ లో 311 మంది మృత్యువాత పడ్డారని.. 2011 ఇళ్ళు పూర్తిగా ధ్వంసం అయ్యాయని.. 2800 ఇళ్ళు పాక్షికంగా దెబ్బ తిన్నాయని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం ఆఫ్ఘన్ డైరెక్టర్ రానా డెరాజ్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో మూడు మసీదులు, నాలుగు స్కూల్స్ కూడా కుళ్ళకూలినట్లు ఆయన వెల్లడించారు.

బఘ్లాన్ ప్రావిన్సులోని బోర్కా జిల్లాలో ఎక్కువ ప్రాణం నష్టం జరిగిందని.. 200 మంది ఇళ్ళలో చిక్కుకుని చనిపోయారని అన్నారు. బఘ్లాన్ లోని ఐదు జిల్లాల్లో భారీ వర్షం కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో అనేక ఇళ్ళు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా 150 మంది చనిపోయారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. భారీ ఆస్తి నష్టం సంభవించిందని.. బదాక్షన్, బగ్లాన్, హెరాత్, ఘోర్ ప్రావిన్సులు ఘోరంగా దెబ్బతిన్నాయని అన్నారు. ఈ ప్రకృతి విధ్వంసం  భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని అన్నారు. గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలు సంభవించడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. సైన్యంతో పాటు అత్యవసర విభాగం సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు.

కూలిన ఇళ్ళ కింద, ఇండ్ల శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అని గాలిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న చాలా మంది మహిళలను, పిల్లలను సిబ్బంది రక్షించారు. వరద బాధితులకు దుప్పట్లు, టెంట్లు, ఆహరం పంపిణీ చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఉత్తర ఆఫ్ఘన్, రాజధాని కాబూల్ ని కలిపే రహదారి మార్గాన్ని మూసివేశారు. గత నెలలో కూడా ఆఫ్ఘన్ పశ్చిమ ప్రాంతంలో వరదలు సంభవించడంతో డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. ఏటా భారీ వర్షాలు, వరదల కారణంగా అక్కడ వందలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల దుబాయ్ లో వరదలు సంభవించి అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేశాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఆఫ్ఘన్ తో పాటు పలు దేశాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి.

Show comments