Tirupathi Rao
Tirupathi Rao
మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత పరిస్థితి విషమంగా ఉంది. ఈ బస్సులో ఆరుగురు బారతీయులు కూడా ఉన్నారనే వార్త కలకలం రేపుతోంది. తక్షణమే సహాయ చర్యలు చేపట్టడానికి కూడా వీలు కాలేదు. ఎందుకంటే బస్సు 50 మీటర్ల లోయలోకి దూసుకెళ్లింది. గురువారం తెల్లవారుజామున ఎలైట్ ప్యాసెంజర్ లైన్ కి చెందిన ఒక బస్సు మెక్సికో రాజధాని టెపిక్ కు సమీపంలో బర్రాన్కా బ్లాంకా వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.
ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 15 మంది పెద్దలు, ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఆరుగురు ఇండియన్స్ కూడా ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. అయితే మృతుల్లో భారతీయులు ఉన్నారా అనే విషయాన్ని వెంటనే వెల్లడించలేమని చెప్పారు. భారతీయులతో పాటుగా ఆఫికన్ దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. టిజువానా అనే సరిహద్దు నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
మృతదేహాలను బస్సు నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మెక్సికో నగరంలో బస్సు ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. జూలైలో ఒక్సాకాలో బస్సు ప్రమాదం జరిగి.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరిలో కూడా ఒక ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సౌత్- సెంట్రల్ అమెరికా నుంచి వలసదారులను తరలిస్తున్న బస్సు సెంట్రల్ మెక్సికో ప్రమాదానికి గురై మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలపై పౌరులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.