iDreamPost
android-app
ios-app

ప్రదర్శనకు ఏలియన్ల మృతదేహాలు.. వాటిని చూసి జనం షాక్‌!

ప్రదర్శనకు ఏలియన్ల మృతదేహాలు.. వాటిని చూసి జనం షాక్‌!

ఏలియన్స్‌ ఉన్నాయా? లేవా? అన్నదానిపై చాలా కాలం నుంచి చర్చ జరుగుతోంది. కొంతమంది ఏలియన్స్‌ను చూశామని అంటూ వాటితో తమకు ఎదురైన అనుభవాలను చెప్పుకుని తిరుగుతున్నారు. మరికొంతమంది అసలు ఏలియన్సే లేవని అంటున్నారు. ఈ రెండు వాదనలను పక్కన పెడితే.. మనుషులకు షాక్‌ ఇచ్చే ఓ సంఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. ఏకంగా మెక్సికన్‌ కాంగ్రెస్‌లో ఏలియన్‌ శవాలంటూ రెండు విచిత్రంగా ఉన్న శరీరాలను ప్రదర్శనకు ఉంచారు.

అద్దాల పెట్టెల్లో ఉంచిన వాటిని చూస్తున్న జనం షాక్‌కు గురవుతూ ఉన్నారు. దీనిపై జర్నలిస్ట్‌, యూఫాలజిస్ట్‌ జైమే మోస్సాన్‌ మాట్లాడుతూ.. ‘‘యూఎఫ్‌ఓ ధ్వంసం కావటం వల్ల ఈ రెండు ఏలియన్ల శరీర భాగాలు దొరకలేదు. ఇవి డయాటమ్‌ గనుల్లో దొరికాయి. ఎక్కువ కాలం అక్కడ ఉండటం వల్ల అవి శిలాజాలుగా మారాయి. రేడియో కార్బన్‌ డేటింగ్‌ ద్వారా వాటి వయసును అంచనా వేయటం జరిగింది. పెరులోని కుస్కోనుంచి వీటిని తీసుకువచ్చారు. ఇవి దాదాపు 1000 ఏళ్ల పూర్వానివని తెలుస్తోంది.

వీటి డీఎన్‌ఏను పరీక్షించినపుడు.. వీటి డీఎన్‌ఏలో 30 శాతం ప్రపంచంలోని జీవులతో సంబంధం లేకుండా ఉందని తేలింది. ఓ ఏలియన్‌ కడుపులో గుడ్లు ఉన్నాయి. ఈ రెండిటి శరీరాల్లో అత్యంత అరుదైన లోహాలు ఉన్నాయి  ’’ అని అన్నారు. ప్రస్తుతం రెండు ఏలియన్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది అవి ఏలియన్స్‌వే అని అంటుంటే.. మరికొంతమంది అదంతా ఫేక్‌ అని అంటున్నారు. మరి, వీటిపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.