iDreamPost
android-app
ios-app

ఆఫ్ఘానిస్తాన్ లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రత

  • Published Oct 15, 2023 | 4:31 PM Updated Updated Oct 15, 2023 | 4:31 PM
ఆఫ్ఘానిస్తాన్ లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రత

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత్, పాకిస్థాన్, జపాన్, నేపాల్, ఇండోనేషియా, అఫ్గానిస్థాన్ వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతుంది. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు అఫ్గానిస్థాన్ లో వరుసగా భూకంపాలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మూడోసారి అఫ్గానిస్థాన్ భూకంపం రావడంతో ప్రజలు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే..

తాలిబన్ పాలనలో పేదరికంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఇప్పుడు వరుస భూకంపాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆదివారం ఉదయం పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.3గా భూకంప తీవ్రత నమోదు అయ్యింది. హెరాత్ నగరానికి దాదాపు 34 కిలోమీటర్ల దూరంలో 8 కిలోమీటర్ల ఉపరితలం లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హెరాత్ ప్రావిన్సులో భూకంపం వచ్చిన చోటే మరోసారి భూకంపం చోటు చేసుకున్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాకపోతే ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు అధికారులు ప్రకటించలేదు.

ఈ నెలలో ఆఫ్ఘనిస్తాన్ లో మూడోసారి భూకంపం వచ్చంది. అక్టోబర్ 7న హెరాత్ ప్రావిన్స్ లో వచ్చిన భూకంపానికి రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంప ప్రమాదంలో 90 శాతం వరకు మహిళలు, చిన్నారులు చనిపోయారని యూనిసెఫ్ తెలిపింది. భూకంప కేంద్రం అయిన జెండాజెన్ జిల్లాలో దాదాపు 1200 మందికి పైగా చనిపోయారు. అక్టోబర్ 11న మరోసారి భూకంపం వచ్చింది.. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతగా నమోదు అయ్యింది. ఈ భూకంపం వల్ల వందల సంఖ్యలో ఇళ్లు, ఇతర కట్టడాలు నేలమట్టం అయ్యాయి.