Tirupathi Rao
Typhoid Fever Symptoms (Adults- Kids) Prevention And Treatment In Telugu: ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, వానల కారణంగా టైఫాయిడ్ జ్వరాలు బాగా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు టైఫాయిడ్ ఎలా వ్యాపిస్తుంది? ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Typhoid Fever Symptoms (Adults- Kids) Prevention And Treatment In Telugu: ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, వానల కారణంగా టైఫాయిడ్ జ్వరాలు బాగా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు టైఫాయిడ్ ఎలా వ్యాపిస్తుంది? ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tirupathi Rao
వర్షాకాలం వచ్చింది అంటే ప్రజల్లో ఒక రకమైన ఆందోళన, భయం ఏర్పడుతుంది. అందుకు కారణం వర్షాలు, దోమలు.. వాటి నుంచి వచ్చే జ్వరాలు గురించే. వాటిలో కూడా మరీ ముఖ్యంగా టైఫాయిడ్ కాస్త డేంజర్ అనే చెప్పాలి. పట్టించుకోకపోతే ప్రాణాలు కూడా పోతాయి. ఈ టైఫాయిడ్ జ్వరాన్ని ఎంత త్వరగా గుర్తించి.. దానికి చికిత్స తీసుకుంటే అంత జాగ్రత్తగా ఉంటారు. అయితే చాలామందికి ఈ టైఫాయిడ్ గురించి సరైన అవగాహన లేదు. అందుకే.. అసలు టైఫాయిడ్ లక్షణాలు ఏంటి? ఎందుకు వస్తుంది? టైఫాయిడ్ ని ఎలా నివారించాలి? అందుబాటులో ఉన్న చికిత్స ఏంటి? ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం.
టైఫాయిడ్ జ్వరాన్ని పేగు సంబంధిత వ్యాధి అని కూడా అంటారు. టైఫాయిడ్ జ్వరం అనేది ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. సల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. టైఫాయిడ్ జ్వరం మీ జీర్ణవ్యవస్థను, శరీరంలో ఉన్న రక్తాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. స్లోగా జీర్ణవ్యవస్థను పని చేయకుండా చేయడమే కాకుండా.. అవయవాలను కూడా పాడు చేస్తుంది. మీరు గనుక సరైన సమయంలో ఈ టైఫాయిడ్ ని గుర్తించి.. దానికి అవసరమైన చికిత్సను తీసుకోకపోతే.. అది ప్రాణాంతకం కూడా అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
టైఫాయిడ్ రావడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మీరు కలుషితమైన ఆహారం తీసుకున్నా, కలుషితమైన నీటిని తాగినా కూడా టైఫాయిడ్ వస్తుంది. అలాగే మీరు ఉండే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా కూడా మీకు టైఫాయిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు టైఫాయిడ్ సోకిన వ్యక్తిని సన్నిహితంగా ఉంటే.. మీకు కూడా ఈ టైఫాయిడ్ జ్వరం సోకుతుంది. టైఫాయిడ్ సోకడానికి ఇవే ప్రధాన కారణాలు.
పెద్దల్లో: టైఫాయిడ్ ఫీవర్ మీకు సోకిన 6 నుంచి 30 రోజుల్లో దాని పూర్తి లక్షణాలు బయట పడతాయి. ఆలోపు మీకు కొన్ని చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా జ్వరం వస్తుంది. కొన్నిసార్లు అది 103 నుంచి 104 డిగ్రీల వరకు కూడా వెళ్లచ్చు. తీవ్రమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. టైఫాయిడ్ సోకితే శరీరంలో సత్తువ లేక ఊరికే.. అలిసిపోతూ ఉంటారు. కండరాలు, కీళ్లనొప్పులు తీవ్రంగా వస్తాయి. ముక్కు కారుతూ ఉండటం, కొన్నిసార్లు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. అతిగా విరేచనాలు కావడం.. లేదంటే మలబద్దకం ఏర్పడం జరగచ్చు. కడుపులో కూడా బాగా నొప్పి వస్తుంది. రెండో వారంలో గులాబి రంగులో దద్దుర్లు పిరుదులు, పొట్ట భాగంలో కనిపిస్తాయి. తికమక పడుతూ ఉంటారు. కొంతమందిలో మూర్ఛ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
పిల్లల్లో: పిల్లలకు కూడా దాదాపుగా ఇవే లక్షణాలు ఉంటాయి. వారిలో కూడా తీవ్రమైన జ్వరం, ఒళ్లు- కండరాలు- కీళ్ల నొప్పు బాధిస్తాయి. పిల్లల్లో కూడా రెండో వారంలో దద్దుర్లు వస్తాయి. వాంతులు, విరేచనాలు కూడా కొందరిని బాధిస్తాయి. కొందరు పిల్లల్లో విరేచనాలలో రక్తం కూడా పడుతుంది. పొట్ట కాస్త ఉబ్బినట్లు ఉండటం ఉంటుంది. పిల్లలు ఆహారం తీసుకునేందుకు నిరాకరిస్తారు. ఆటలు, అల్లరి లేకుండా డీలా పడిపోతారు. ఓపిక లేక అలా కూర్చుండి పోతారు.
టైఫాయిడ్ సోకిన వ్యక్తులు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ఎంతో అవసరం. అంటే ముఖ్యంగా ఫ్లూయిట్స్ తీసుకుంటూ ఉండాలి. ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీళ్లు తాగాలి. పెరుగు వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది. అలాగే గుడ్డు చాలా మంచి పౌష్టికాహారం. టైఫాయిడ్ సోకిన వారికి గుడ్డు పెట్టాలి. సాధారణంగా జ్వరం అంటే బంగాళదుంపలు వద్దు అంటారు. కానీ, టైఫాయిడ్ సోకిన వారికి ఉడికించిన బంగాళదుంపలు, మెత్తగా ఉడికించిన అన్నం పెట్టమని చెప్తారు. ఒమేగా-3, ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా పెట్టమని చెప్తారు. అలాగే ఉడికించిన కూరగాయలు పెడితే.. శక్తి రావడమే కాకుండా.. త్వరగా జీర్ణం కూడా అవుతాయి.
టైఫాయిడ్ సోకిన వ్యక్తులకు జీర్ణ వ్యవస్థ చాలా వీక్ గా ఉంటుంది. అందుకే మీరు త్వరగా, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తినాల్సి ఉంటుంది. గ్యాస్ వచ్చే ప్రమాదం ఉన్న కూరగాయలు, ఆహార పదార్థాలను తీసుకోకూడదు. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే ఆహార పదార్థలకు కూడా దూరంగా ఉండాలి. మసాలాలు, ఘాటుగా ఉండే ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని కూడా తినకూడదు. సాధ్యమైనంత వరకు వేపుళ్లు, స్పైసీ ఆహారం వంటివి తినకూడదు. ముఖ్యంగా మంచినీళ్లు తాగడం చాలా ప్రధానం.
టైఫాయిడ్ సోకేది ముఖ్యంగా కలుషిత ఆహారం, కలుషిత నీటి వల్ల. అంటే మీరు వేడిగా ఉండే ఆహారాన్ని తినాలి. అలాగే మంచినీటిని కాచి చల్లార్చిన తర్వాతే తాగాలి. అలాగే మీ వంట గది కూడా చాలా శుభ్రంగా ఉండాలి. అంతేకాకుండా మీ ఇంటి చుట్టు పక్కల పరిసరాలు చాలా శుభ్రంగా ఉండాలి. బురద, చెత్త, దోమలు లేకుండా చూసుకోవాలి. అలాంటి పరిసరాల వల్ల టైఫాయిడ్ సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే టైఫాయిడ్ సోకిన వారికి కాస్త దూరంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మీకు కూడా టైఫాయిడ్ సోకే ప్రమాదం ఉంటుంది.
టైఫాయిడ్ ఎంత త్వరగా గుర్తించి.. అంత తర్వగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా టైఫాయిడ్ కి యాంటీ బయాటిక్స్ తో చికిత్స అందిస్తారు. అలాగే డీహైడ్రేషన్ తగ్గించడానికి.. ఓరల్ గా గానీ, సెలైన్స్ వంటివి పెట్టి శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. చికిత్సలో భాగంగా తరచూ రక్త పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. బ్లడ్ కౌంట్, లివర్ ఫంక్షన్ వంటి పరీక్షలు రోజూ చేయాల్సి ఉంటుంది. టైఫాయిడ్ తగ్గుతోందా? ముదురుతోందా అనేది ఈ పరీక్షల ద్వారా మానిటర్ చేస్తూ ఉంటారు. అలాగే టైఫాయిడ్ కి సంబంధించి టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎలాంటి టీకా తీసుకోవాలి? ఏ వయసు వాళ్లు తీసుకోవాలి? బూస్టర్ డోస్ ఉంటుందా? ఇలాంటి సమాచారం కోసం వైద్యులను సంప్రదిస్తే మంచిది. పిల్లలైనా- పెద్దలైనా.. టీకాలను ఎప్పుడూ వైద్యుల సూచనల మేరకు మాత్రమే తీసుకోవాలి.