iDreamPost

Rainy Season: మొదలైన వర్షాకాలం.. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఇలా చేయండి

  • Published Jun 10, 2024 | 3:04 PMUpdated Jun 10, 2024 | 3:04 PM

వానాకాలం మొదలైంది. ఇక సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి ఈ కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

వానాకాలం మొదలైంది. ఇక సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి ఈ కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

  • Published Jun 10, 2024 | 3:04 PMUpdated Jun 10, 2024 | 3:04 PM
Rainy Season: మొదలైన వర్షాకాలం.. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఇలా చేయండి

ఈ ఏడాది కాస్త ముందుగానే వర్షాకాలం ప్రారంభం అయ్యింది. జూన్‌ నెలారంభం నుంచే వానలు కురుస్తున్నాయి. ఇక ఈ ఏడాది జోరు వానలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అన్నదాతలు వ్యవసాయం పనులు ప్రారంభించారు. ఇక జోరు వానల నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక వర్షా కాలంలో సీజనల్‌ వ్యాధులతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు. అప్పటి వరకు ఎండలు ఉండి.. ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారడం.. పైగా వానా కాలంలో ఈగలు, దోమలు విజృంభించడం వంటి కారణాల వల్ల సీజనల్‌ వ్యాధుల బారిన పడే అవకాశాలు అధికం. కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. వర్షాకాలంలో మీ ఆరోగ్యాన్ని భద్రంగా చూసుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. ఆ వివరాలు..

వానాకాలంలో దోమలు, ఈగలు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇక దోమల వల్ల ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీటిలో మరీ ముఖ్యంగా డెంగ్యూ, టైఫాయిడ్‌ వంటి వాటి బారిన పడితే ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

డెంగ్యూ..

దోమల వల్ల వచ్చే ప్రమాదకరమైన వ్యాధి డెంగ్యూ. ఇది టైగర్‌ మస్కిటో వల్ల వస్తుంది. ఓళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మం మీద దద్దుర్లు, జ్వరం వస్తే.. వైరల్‌ ఫీవర్‌ అని లైట్‌ తీసుకోకుండా.. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చెక్‌ చేయించుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా.. మెదడులో రక్తస్రావం, రక్తనాళాలు దెబ్బ తినటం, కాలేయ సమస్యలు తలెత్తి.. ఆరోగ్యం విషమిస్తుంది. కనుక ఈ సీజన్‌లో వచ్చే ఎంత చిన్న జ్వరాన్ని అయినా తేలిగ్గా తీసుకోకూడదు.

జాగ్రత్తలు..

  • డెంగ్యూ జ్వరానికి వ్యాక్సిన్‌ లేదు. కనుక ఈ జ్వరం రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం.
  • దోమలకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందే అవకాశం లేకుండా చూసుకోవాలి.
  • ఈ సీజన్‌లో శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.
  • పడుకునేముందు దోమల మందు, దోమతెర వంటివి వాడాలి.
  • ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు మెష్‌లు వాడాలి.
  • సాయంత్రం కాగానే తలుపులు మూసివేయాలి.

టైఫాయిడ్‌..

ఈ సీజన్‌లో వచ్చే మరో ప్రమాదకరమైన జ్వరం టైఫాయిడ్‌. ఇది ‘సాల్మనొల్లా టైపై’ అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. శుభ్రంగా లేని ఆహారం, నీళ్ల ద్వారా వస్తుంది. అందులోనూ ఈ బ్యాక్టీరియా సోకిన మూడు వారాల తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి. అందుకే కొద్దిగా జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి లాంటివి గమనిస్తే.. వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి.

జాగ్రత్తలు

  • చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
  • ఆహారం తినేముందు, తిన్న తర్వాత తప్పనిసరిగా సబ్బునీళ్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • వీలైతే హ్యాండ్ శానిటైజర్ దగ్గర ఉంచుకోవాలి.
  • వేడిచేసి చల్లార్చిన నీరు తాగాలి.
  • స్నానం చేసేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు పొరపాటున కూడా నీళ్లు మింగకూడదు.
  • కూరగాయలను కూడా గోరు వెచ్చని నీటితో కడిగితే మంచిది.
  • ఈ సీజన్‌లో ఆకుకూరలను మరింత శుభ్రంగా కడుక్కొని వండుకోవాలి
  • అప్పటికప్పుడు వండుకున్న వేడి పదార్థాలే తినాలి.
  • బయటి ఆహారం పూర్తిగా మానేయటం మంచిది.

శ్వాసకోశ సమస్యలు

వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో వైరస్లు, బ్యాక్టీరియాలు తేలికగా మనపై దాడి చేస్తాయి. అందుకే కాలం మారగానే చాలా మందికి జలుబు, దగ్గు వస్తుంటాయి. అలాంటి వారు ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

జాగ్రత్తలు..

  • ఈ కాలంలో విటమిన్-సి కలిగిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
  • చల్లని నీరు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • తగినంత నిద్ర, పోషకాహారం తీసుకోవాలి.
  • చల్లని గాలి, నీరు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి.

కళ్ల, చర్మ ఇన్ఫెక్షన్లు

సీజన్ మారేటప్పుడు తరచుగా కళ్ల, చర్మ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వాతావరణంలో తేమ పెరగడం వల్ల కళ్లకలక, కళ్లు పొడిబారటం వంటి సమస్యలు వస్తాయి. అందుకే చేతులు కడుక్కోకుండా.. కళ్లను తాకకూడదు. ఒకవేళ కళ్లకలక లక్షణాలు కనిపిస్తే.. వెంటనే కళ్లను శుభ్రమైన నీళ్లతో కడిగి వేడి నీటితో కాపడంపెట్టాలి. వీలైనంత త్వరగా డాక్టర్ని కలవాలి. కళ్లు ఎర్రబడటం, దురదలు, మంట కనిపిస్తే సొంత వైద్యం మాని ఆస్పత్రికి వెళ్లాలి. అలాగే చర్మాన్ని కాపాడుకునేందుకు.. వర్షంలో తడవకుండా ఉంటే బెటర్. ఒకవేళ తడవాల్సి వస్తే.. ఇంటికి వెళ్లగానే స్నానం చేయాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి