Dharani
Brain Stroke: గంటల తరబడి ఏసీలో కూర్చుని.. ఒక్కసారిగా ఎండలోకి వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే అంటున్నారు వైద్యులు. ఆ వివరాలు..
Brain Stroke: గంటల తరబడి ఏసీలో కూర్చుని.. ఒక్కసారిగా ఎండలోకి వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే అంటున్నారు వైద్యులు. ఆ వివరాలు..
Dharani
గత కాలాలతో పోలిస్తే.. ఈ ఏడాది ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మార్చి నెల ప్రారంభం నుంచే భానుడు తన ప్రభావం చూపడం మొదలు పెట్టాడు. ఇక మే నెల ప్రారంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా 46 డిగ్రీల ఎండ కాస్తుంది. ఉదయం 7 నుంచి ఉక్కపోత ఆరంభం అవుతుంది. అర్థరాత్రి 12 దాటితే కానీ చల్లబడటం లేదు. ఇక మధ్యాహ్న సమయంలో అడుగు బయటపెట్టడం కాదు కదా.. డోర్ తెరవాలన్నా.. వడగాడ్పులు భయపెడుతున్నాయి. ఇక ఆఫీసులకు వెళ్లే వారి పరిస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎండలో మాడి పోతున్నారు. ఈ క్రమంలో వైద్యులు కీలక అలర్ట్ జారీ చేశారు. గంటల తరబడి ఏసీలో కూర్చుని.. ఎండలోకి వెళ్లే వారు తీవ్ర అనారోగ్యం బారినపడుతున్నారని వైద్యులు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..
వేసవి కాలంలో షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి వైద్యులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట. ఈ కేసుల్లో ఎక్కువ మంది షుగర్, బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారే ఉన్నారట. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు వైద్యులు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ కూడా వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
అలానే చాలా సేపు ఎండలో ఉండి వచ్చిన వారు కూడా నేరుగా ఏసీ గదిలోకి వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. ఎండలో నుంచి వచ్చినా.. ఏసీ గదిలోంచి వెళ్లినా.. తొలుత సాధారణ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో కొంత సమయం ఆగి.. ఆ తర్వాత వెళ్లాలి అంటున్నారు. లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు తరువాత అత్యధిక మంది మరణానికి కారణం అవుతుంది బ్రెయిన్ స్ట్రోకే అని.. కనుక వేసవి పూర్తయ్యేవరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ మధ్య నమోదైన బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో మహిళలే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు షుగర్, బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్న 50-60 ఏళ్ల వయస్సు గలవారు ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది ఆందోళన కలిగించే అంశమని.. వీరంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మనిషికి రెండు రకాల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. ఒకటి సిస్మిక్ స్ట్రోక్. ఈ స్థితిలో మనిషి మెదడుకు వెళ్లే రక్తనాళాలు మూసుకుపోతాయి. దీంతో మెదడుకి రక్త సరఫరా నిలిచిపోతుంది. ఇక రెండోది హెమరేజిక్ స్ట్రోక్. ఇందులో మెదడు సిరా చీలిక కారణంగా రక్త ప్రవాహం పెరుగుతుంది. దీని వల్ల శరీరంలోని ఏ అవయవానికైనా పక్షవాతం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇక బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడి వ్యక్తికి తొలి గంటే కీలకం అని.. దీన్నే గోల్డెన్ అవర్ అంటారని.. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన గంటలోపు బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తే.. ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.