మొన్న యాక్షన్ కింగ్ అర్జున్ తన మీద తీవ్ర ఆరోపణలు చేశాక ఎట్టకేలకు విశ్వక్ సేన్ వైపు నుంచి వెర్షన్ వచ్చేసింది. నిన్న ఓ సినిమా లాంచ్ కి విచ్చేసిన ఫలక్ నుమా దాస్ తనకన్నా ప్రొఫెషనల్ గా ఎవరూ ఉండరని, అది లైట్ బాయ్ ని అడిగినా చెబుతాడని, ఒకవేళ అలా కాదని ఎవరైనా అంటే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమని ప్రకటించేశాడు. ఒకింత ఎమోషనల్ అయిన విశ్వక్ అర్జున్ తనకు స్క్రిప్ట్ ని చెప్పే క్రమంలో ఏ మార్పులకు ఒప్పుకోలేదని అందుకే ఇబ్బంది పడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. ఉదయం అయిదు గంటలకు షూటింగ్ క్యాన్సిల్ చేయడం లాంటివి ఇండస్ట్రీలో జరుగుతుంటాయని వాటిని భూతద్దంలో చూడటం ఏంటని అడిగాడు.
ఇదంతా కాసేపు పక్కనపెడితే విశ్వక్ సేన్ ఇష్యూ నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. ఏ కథను గుడ్డిగా నమ్మకూడదు. ఒకవేళ నచ్చకపోతే అవతల చెబుతున్న వ్యక్తి ఎంత సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అయినా సరే మొహమాటం లేకుండా నో చెప్పాలి. అంతే తప్ప తీరా ఒప్పుకున్నాక డేట్లనీ సెట్ చేసుకున్నాక ఇప్పుడు నాకు సెట్ కావడం లేదంటే మాత్రం అది ఆర్టిస్టు తప్పే అవుతుంది. సలహాలు ఇవ్వడం తప్పేమి కాదు కానీ ఒక దర్శకుడికి విపరీతమైన అనుభవం ఉన్నప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పడానికి ఏమీ ఉండదు. చెప్పినట్టు నటించి చేసుకుంటూ పోవడమే. చరణ్ తారక్ లు రాజమౌళి విషయంలో ఎలా ప్రవర్తించారో చూశాంగా..
ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు దేవుడి మీద భారం వేసే కొనసాగించాలి తప్ప నిర్మాతకు కోట్లలో నష్టం కలిగేలా మధ్యలో చేతులెత్తేయకూడదు. అర్జున్ ఏనాడూ బయటికి వచ్చి ఇలా చెప్పుకున్న దాఖలాలు లేవు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నటనానుభవం ఆయనది. చిరంజీవి, కమల్ హాసన్ లాంటి సీనియర్లతో మొదలుకుని అల్లు అర్జున్, రామ్ లాంటి యంగ్ స్టర్స్ దాకా ఎందరితోనో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఆయన నేర్చుకోవడానికి ఏమీ లేదు. అందుకే విశ్వక్ వైపే పూర్తిగా సాఫ్ట్ కార్నర్ రాలేదు. ఏది ఏమైనా ఇకనైనా యూత్ హీరోలు ఇలాంటివి జరగకుండా చూసుకుంటే కెరీర్ మంచి అవకాశాలతో ఎంతో బాగుంటుంది.