కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుంది ట్విట్టర్ తాజా పరిస్థితి చూస్తుంటే. ఎలాన్ మస్క్ ఈ కంపెనీని కొన్నాక చిత్ర విచిత్రమైన సంస్కరణలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేవలం సెలబ్రిటీలకే పరిమితమైన బ్లూ టిక్ స్టేటస్ ని ఎవరైనా నెలకు 8 డాలర్లు చెల్లించి పొందవచ్చనే వెసులుబాటు ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. గతంలో ఇది సదరు రంగాల్లో ప్రముఖులు లేదా నిష్ణాతులు అయిన వాళ్లకు మాత్రమే వెరిఫై చేసి ఇచ్చేవాళ్ళు. ఇది అంత సులభంగా రాదు. దానికి ప్రత్యేకంగా ఒక టీమ్, మనం సమర్పించే ఆధారాలు చెక్ చేశాక వడబోత కార్యక్రమం చేసి ఆ తర్వాత ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేవాళ్ళు.
ఇదంతా పైసా ఖర్చు లేకుండా జరిగిపోయేది. సినీ జర్నలిస్టులు యాక్టర్లు టెక్నీషియన్లు ఇలా వారు వీరు అనే తేడా లేకుండా గుర్తింపు ఉన్న ప్రతిఒక్కరికి బ్లూ టిక్ వచ్చింది. కానీ సామాన్యులకు మాత్రం దూరంగా ఉంది. కానీ ఇప్పుడలా కాదు. సంవత్సరానికి 96 డాలర్లు మనవి కాదనుకుంటే హ్యాపీగా నీలి రంగు టిక్కు మార్కుని ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇది విదేశాల్లో అమలులోకి తెచ్చారు. ఇండియాకు రాలేనంత మాత్రాన మనవాళ్ళు ఊరుకుంటారా. ఎన్ఆర్ఐలు కొందరు వెంటనే కొనేసుకోగా, కేవలం హీరోలను విపరీతంగా అభిమానిస్తూ వాళ్ళ కోసమే ట్విట్టర్ యుద్ధాలు చేసే ఫ్యాన్ క్లబ్స్ ఫారిన్ లో ఉన్న ఫ్రెండ్స్ సహాయంతో బ్లూలోకి మారిపోయారు.
దెబ్బకు ఎవరి హ్యాండిల్ చూసినా బ్లూ టిక్కు కనిపిస్తోంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తదితర ఫ్యాన్ క్లబ్స్ అన్నీ డబ్బులు కట్టి మరీ తీసేసుకున్నాయి. ఇంకొందరు ఏకంగా అతి తెలివి చూపిస్తూ డమ్మీ అకౌంట్లతో హీరోలు రాజకీయ నాయకుల ఫోటోలు డిపిలు పెట్టి బ్లూగా మార్చుకున్నారు కానీ ఫేక్ ని తెలిసిన వెంటనే ట్విట్టర్ వాటిని సస్పెన్డ్ చేస్తోంది. అంతే కాదు కట్టిన డబ్బులు కూడా వెనక్కు ఇవ్వకుండా షాక్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో స్టార్ హీరోకి అతని అభిమానికి ఫాలోయర్ నెంబర్ తో సంబంధం లేకుండా బ్లూ స్టేటస్ ఉండబోతోంది. మళ్ళీ ఎలాన్ మస్క్ ఎలాంటి ట్విస్టు ఇవ్వనంత కాలం ఇదలాగే కొనసాగుతూ ఉంటుంది.