అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? దీనిపై మరికొద్ది రోజుల్లో ఆయన స్పష్టతనిచ్చే అవకాశముంది.వచ్చే వారం తానో కీలక ప్రకటన చేస్తానని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. దీంతో ఎన్నికల్లో పోటీపైనేత ఆయన ప్రకటన ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారం నిమిత్తం ట్రంప్ ఒహైయోలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”నవంబరు 15న ఫ్లోరిడాలో నేను చాలా పెద్ద ప్రకటన చేయబోతున్నా” అని తెలిపారు. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ ఆసక్తిగా ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆయన స్పష్టతనివ్వట్లేదు.
తాజాగా కీలక ప్రకటన చేయబోతున్నానని చెప్పడంతో.. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభించే అవకాశముందని అమెరికా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అధ్యక్ష ఎన్నికల గురించి ట్రంప్ ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, మధ్యంతర ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూస్తే బాగుంటుందని కొందరు రిపబ్లికన్ నేతలు సూచిస్తున్నారట. కానీ, ట్రంప్ మాత్రం వీలైంతన త్వరగా తన ప్రణాళికతో ముందుకెళ్లాలని యోచిస్తున్నట్లు సదరు కథనాలు తెలిపాయి.
2016 రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2020లో రెండోసారి పోటీ చేయగా.. డెమోక్రటిక్ నేత జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు.