థియేటర్ కు ఓటిటికి మధ్య కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని నిర్మాతల మండలి దాన్ని అమలు పరచాలని చూస్తుంటే ఆచరణలో మాత్రం అది జరిగేలా కనిపించడం లేదు. దీపావళి పండుగా సందర్భంగా గత నెల 21న విడుదలైన ఓరి దేవుడా ఇవాళ అర్ధరాత్రి నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. విశ్వక్ సేన్ నటించిన ఈ తమిళ రీమేక్ కు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రెస్పాన్స్ దక్కింది కానీ ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేదు. జస్ట్ యావరేజ్ దగ్గర నిలిచిపోయింది. మొదటి వారం పర్వాలేదు అనిపించినా తర్వాత మాత్రం పూర్తిగా నెమ్మదించిపోయి ఫైనల్ రన్ కు త్వరగా వచ్చేసింది. అంటే మూడో వారం దాటడం ఆలస్యం స్మార్ట్ స్క్రీన్ పై ప్రత్యక్షం.
గత నెల స్వాతిముత్యం కూడా ఇదే తరహాలో కేవలం ఇరవై రోజులకే చిన్నితెరపై ప్రీమియర్ అయ్యింది. దీనికీ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది కానీ దాన్ని వసూళ్లుగా మార్చుకోవడంలో ఫెయిలయ్యింది. ఇప్పుడు దీనికి ఓరి దేవుడా తోడయ్యింది. అసలు ఎలాంటి ప్రకటన ప్రమోషన్లు పెద్దగా చేయకుండా ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. నిజానికి రేపటి షెడ్యూల్ లో బాలకృష్ణ అన్ స్థాపబుల్ కొత్త ఎపిసోడ్ ఉండాలి. కానీ ఇంకా ఇంటర్వ్యూ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఇప్పుడీ ఓరి దేవుడాని లైన్ లో పెట్టేశారు. పివిపి లాంటి పెద్ద బ్యానర్ నిర్మించిన ఈ ఎంటర్ టైనర్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన ఓటిటిలోనే వచ్చింది.
ఈ లెక్కన ఇకపై ఎయిట్ వీక్స్ కండీషన్ పాటించడం అసాధ్యంగానే కనిపిస్తోంది. అంత గ్యాప్ దేవుడెరుగు కనీనం ఓ నెల రోజులు ఆపడం కూడా కష్టంగానే ఉంది. ఎందుకంటే అగ్రిమెంట్ టైంలోనే ఓటిటిలు ఎక్కువ రేట్ కావాలంటే స్పష్టంగా ఫలానా టైంలోపలే అని ముందే తేల్చి చెబుతున్నారు. అలాంటప్పుడు ఏ ప్రయోజనం లేని మునుపటి నిర్ణయాలకు కట్టుబడటం జరిగే పని కాదు. అయినా ఆగస్ట్ తర్వాత ఒప్పందం చేసుకున్న వాటికి ఇది వర్తిస్తుందని ప్రొడ్యూసర్ కౌన్సిల్ చెప్పింది కానీ అలాంటివి ఆశించకపోవడం బెటర్. ఓరి దేవుడాకు అశ్విన్ మరిముత్తు దర్శకత్వం వహించగా విక్టరీ వెంకటేష్ చేసిన స్పెషల్ క్యామియో ఆకర్షణగా నిలిచింది.