iDreamPost
android-app
ios-app

తెలుగు ప్రేక్షకులకు IMAX శాపం

తెలుగు ప్రేక్షకులకు IMAX శాపం

దేశం మొత్తం మీద అత్యధిక సినిమా ప్రేమికులు ఎక్కడ ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చేది తెలుగు రాష్ట్రాలే. అందుకే ఎక్కడా లేనన్ని థియేటర్లు, ఆక్యుపెన్సీలు మన దగ్గరే ఉంటాయి. కరోనా లాక్ డౌన్ అయ్యాక ప్రతి చోట జనం బయటికి రావడానికి భయపడుతుంటే హాళ్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు ముందు ఇక్కడే పడ్డాయి. ఆ రేంజ్ మూవీ లవర్స్ మనకే ఉన్నారు. అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడా ఒక్క ఐమ్యాక్స్ స్క్రీన్ లేదంటే ఆశ్చర్యంతో బాధ కలిగించే వాస్తవం. ఒకప్పుడు హైదరాబాద్ ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లార్జ్ స్క్రీన్ ఈ ఫార్మట్ లోనే నడిచేది. అనలాగ్ నుంచి డిజిటల్ లోకి మారిపోయాక ఆ సౌకర్యం తీసేశారు. దీంతో అది కూడా అన్నిట్లో ఒకటిగా మారిపోయింది.

ఆ తర్వాత ప్రధాన నగరాలు అన్నిచోట్లా బోలెడు మల్టీ ప్లెక్సులు వచ్చాయి కానీ పివిఆర్, సినీపోలీస్, ఐనాక్స్, మిరాజ్, ప్లాటినం తదితర కార్పొరేట్ సంస్థలేవి మన దగ్గర ఐమ్యాక్స్ స్థాపించే దిశగా చర్యలు తీసుకోలేదు. బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎక్స్ క్లూజివ్ IMAXలు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం పెట్టలేకపోయారు. కారణం ఉందట. టికెట్ ధరలకు సంబంధించి తెలుగు స్టేట్స్ లో గరిష్ట ధరకు ఒక నిర్దిష్టమైన పరిమితి ఉంది. కానీ ఐమాక్స్ కు అలా వర్క్ అవుట్ కాదు. ఒక్కోసారి అయిదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా టికెట్ రేట్ పెట్టాల్సి ఉంటుంది. దానికి గవర్నమెంట్ ఒప్పుకోలేదు. పైగా ఈ ప్రొజెక్షన్ ఖరీదైన వ్యవహారం.

త్వరలో భాగ్యనగరంలోని మరమత్తులో ఉన్న మంజీరా మాల్ లో లులు కంపెనీ ఓ మల్టీ ప్లెక్స్ ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తోందట. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది లేదా 2024లో స్టార్ట్ చేసేలా ప్రణాళికలు అనుమతులు వచ్చాయని తెలిసింది. అందులో ఐమాక్స్ ఉందంటున్నారు కానీ అఫీషియల్ ప్రకటన వస్తే కానీ చెప్పలేం. ఎంత గొప్ప సౌండ్ సిస్టమ్, 4కె స్క్రీన్లు, డాల్బీ అట్మోస్ లు ఉన్నా ఐమాక్స్ తెరపై చూసే అనుభూతి ముందు ఏదీ సాటి రాదు. ఆర్ఆర్ఆర్ అమెరికా, జపాన్ లో ఇలాంటి తెరమీద ప్రదర్శించినప్పుడు  ఆ దేశాల ఆడియన్స్ రెస్పాన్స్ మాములుగా లేదు. అందుకే ఐమాక్స్ లేకపోవడం తెలుగు ప్రేక్షకులకు శాపమని మూవీ లవర్స్ వాపోతారు.