ఒక లెజెండరీ నటుడు వెళ్ళిపోయాక అతని తాలూకు జ్ఞాపకాలు, స్ఫూర్తినిచ్చే అవశేషాలు తర్వాతి తరానికి అందివ్వడం చాలా అవసరం. ప్రభుత్వాల మాట ఎలా ఉన్నా కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిందే. ఇప్పటికీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పేర్ల మీదుగా విగ్రహాలు, పార్కులు ఉన్నాయి కానీ వాళ్ళ గురించి సవివరంగా చెప్పే ఎలాంటి చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోలేదు. ఏదో మహానాడులో టిడిపి ఒక టెంటులో ఫోటోలు పెట్టడం మినహాయించి అంతకు మించి చేసిందేమీ లేదు. శోభన్ బాబు చెన్నైలో నివాసం వుండి అక్కడే కాలం చేయడం వల్ల ఎంత అభిమానులున్నా ఏమీ చేయలేకపోయారు. కానీ కృష్ణకు అలా జరగనివ్వరట.
హైదరాబాద్ లో కృష్ణ మెమోరియల్ పేరిట ఒక మ్యూజియం ని ఏర్పాటు చేసే ఆలోచనలో మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు ప్లానింగ్ లో ఉన్నారట. ఇందులో సూపర్ స్టార్ విగ్రహంతో పాటు ఆయన నటించిన మూడు వందల యాభై సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, ఆరుదైన ఫోటోలు, పేపర్ కట్టింగులు, వీడియో ఆడియో క్యాసెట్లు, విసిడి డివిడిలు ఇలా సాధ్యమైనన్ని సేకరించి మొత్తం అక్కడ ఉంచబోతున్నట్టు తెలిసింది. ఇందుకుగాను అవసరమైన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా లేక పద్మాలయ స్టూడియోస్ లో ఇప్పటికీ తమ పేరు మీదున్న ఐదెకరాల స్థలంలో ఏదైనా ప్లాన్ చేస్తారా అనేది ఇంకా వేచి చూడాలి. అఫీషియల్ గా చెప్పలేదు.
నిజంగా ఇది చాలా మంచి పని. ఇంకో యాభై వంద సంవత్సరాల తర్వాత కూడా కృష్ణ గారి గురించి అందరూ తెలుసుకునే అవకాశం దీని వల్ల కలుగుతుంది. ఒక స్టార్ హీరో ఇన్నేసి సినిమాలు చేసి దర్శకత్వం నిర్మాణంతో పాటు అన్నేసి బాధ్యతలు ఎలా నిర్వర్తించారనే స్ఫూర్తి ఖచ్చితంగా వాళ్లకు కలుగుతుంది. కృష్ణ గారి మీద ఇప్పటికే బోలెడు పుస్తకాలు వచ్చాయి. డాక్యుమెంటరీలు, వీడియో చిత్రాలు తీసినవాళ్లు ఉన్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇలా మెమోరియల్ పెట్టడం ద్వారా ఫ్యాన్స్ ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్లి తమ హీరో జ్ఞాపకాలను నెమరువేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకో ఏడాదిలోపే దీనికి సంబంధించిన పనులు జరిగే అవకాశం ఉన్నట్టు టాక్.