భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మిన పాల్వంచ కేటీపీఎస్ (KTPS) పాత విద్యుత్ ప్లాంట్ (ఓ అండ్ ఎం) ఇక కాలగర్భం లో కలిసిపోనున్నట్లు తెలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) కే తలమానికంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మిన పాల్వంచ కేటీపీఎస్ (KTPS) పాత విద్యుత్ ప్లాంట్ (ఓ అండ్ ఎం) ఇక కాలగర్భం లో కలిసిపోనున్నట్లు తెలుస్తోంది. ఇంటింటికీ కాంతులు పంచి, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసిన ఈ విద్యుత్ కర్మాగారం అతి త్వరలో కనుమరుగు కానుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ)కి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్లో కాలం చెల్లిన ఈ కర్మాగారాన్ని మూసేసింది. ఇప్పుడు ప్లాంట్‌లోని ఇతర నిర్మాణాలను పూర్తిగా తొలగించాలనే ప్రతిపాదనలు తెరమీదకు రాగా, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధ్యయనం మేరకు నేలమట్టం చేసేందుకు అడుగులుపడుతున్నాయి. వందల టన్నుల భారీ లోహ యంత్రాలను జెన్ కో సంస్థ తుక్కుగా విక్రయించనుండగా, ఎంఎస్సీసీ కన్సల్టెన్సీ టెండర్లను ముంబైకి చెందిన హెచ్ ఆర్ కమర్షియల్ సంస్థ రూ.485.05 కోట్లకు దక్కించుకుంది. ఇక జెన్ కో నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాగానే ఒకట్రెండు నెలల్లో తొలగింపు పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
కేటీపీఎస్ ప్లాంట్ నిర్మాణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేంద్రంగా 1968 సంవత్సరంలో చేపట్టారు. జపాన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ కర్మాగారం మొదటి దశ 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లతో ప్రారంభమైంది. రెండో దశలో 1967లో 60 మెగావాట్ల రెండు యూనిట్లు, మూడో దశలో 1974, 1975,లలో 120 మెగావాట్ల రెండు యూనిట్లు, నాలుగో దశలో 1977, 1978లో 120 మెగావాట్ల సామర్థ్యంతో మరో రెండు యూనిట్లను నిర్మించారు.
మొత్తం నాలుగు దశల్లో 720 మెగావాట్ల విద్యుత్తును ఆరు దశాబ్దాల పాటు రాష్ట్రానికి అందించింది. కర్మాగారం కాల పరిమితి ముగియడంతో మూసివేత అనివార్యమైంది. ఈ క్రమంలో టీఎస్ జెన్ కో ఒక అడుగు ముందుకేసి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంటు నిర్మాణం చేపట్టింది. సూపర్ టెక్నాలజీతో బీహెచ్ఈఎల్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.6 వేల కోట్ల వ్యయంతో కేటీపీఎస్ 7వ దశను 2018లో ప్రారంభించింది.
కాగా పాత ప్లాంట్ కూలింగ్ టవర్లు, చిమ్నీలు, బాయిలర్లు, ఈఎస్పీ, అడ్మిన్ బ్లాక్లు ఇతర అనేక నిర్మాణాలన్నీ త్వరలోనే నేల మట్టం చేయనున్నారు. ఇందులో 8వ దశ కర్మాగారానికి అవసరమైన వాటిని మినహాయిస్తూ ఇప్పటికే మార్కింగ్ పూర్తి చేశారు. ఇదిలా ఉండగా వందలాది ఎకరాల విస్తీర్ణం కలిగిన పాత ప్లాంట్ పూర్తిగా నేలమట్టం కానుండగా, దాని స్థానంలో మరో విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై జెన్ కో యాజమాన్యం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం చేపడతారనే ప్రతిపాదన ఉన్నా.. అధికారిక ప్రకటన రాలేదు. అధిక కాలుష్య ఉద్గారాల కారణంగా మరో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించే అవకాశాల్లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇక్కడి భౌగోళిక వనరుల దృష్ట్యా అన్ని అనుకూలతలు ఉన్నందున, ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాల్సిందే.