ఇది నిజంగా నమ్మశక్యం కానీ నిజం. కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ అయ్యిందంటే దానికి ఎన్నో కారణాలున్నాయి. మాస్ హీరోయిజం, ఎప్పుడూ చూడని కోలార్ బంగారు గనుల నేపథ్యం, కోట్లాది రూపాయల బడ్జెట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా రాఖీ భాయ్ తరహా పాత్రలు గతంలోనూ వచ్చినప్పటికీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే తరహాలో ఆడియన్స్ ఫీలవ్వడంతో అంత గొప్ప విజయం సొంతం చేసుకుంది. చాలా పరిమితంగా ఉండే శాండల్ వుడ్ మార్కెట్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిన ఘనత మాత్రం కెజిఎఫ్ కే దక్కుతుంది. అలాంటి గ్రాండియర్ ని అంచనాలే లేని ఒక చిన్న సినిమా బీట్ చేయడం సాధ్యమేనా. అవునని ఋజువు అయ్యింది.
కర్ణాటకలో కాంతార ఏకంగా కెజిఎఫ్ 2 నమోదు చేసిన ఫుల్ రన్ 175 కోట్ల గ్రాస్ వసూళ్లను ఇంకా యాభై రోజులు కాకుండానే దాటేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇదొక్కటే కాదు రెండు కోట్లకు పైగా ఫుట్ ఫాల్స్ నమోదైన కన్నడ చిత్రంగా మరో ఘనత కూడా సాధించింది. ఆ రాష్ట్రంలో చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమావుతూనే ఉంది. తెలుగులోనూ యాభై కోట్ల గ్రాస్ పాతిక కోట్ల షేర్ ని కొట్టేసిన కాంతార ఏపీ తెలంగాణలో ఆడుతూనే ఉంది. గాడ్ ఫాదర్ లాంటివి రెండో వారానికే నెమ్మదిస్తే కాంతార డబ్బింగ్ వెర్షన్ నెల రోజులకు పైగా సుదీర్ఘంగా నడవటం విశేషమే. తెలుగు వెర్షన్ లో కెజిఎఫ్ 2 దాటే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
ఎలా చూసుకున్నా కాంతార సాధించిన ఘనత చిన్నది కాదు. హిందీలోనూ ఏ పోటీ వస్తున్నా లెక్కచేయకుండా కంటిన్యూ అవుతోంది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ విలేజ్ డ్రామా మొదటిరోజు కన్నడనాట కలెక్షన్ కేవలం 2 కోట్లు. ఇప్పుడు డబుల్ సెంచరీకి టార్గెట్ పెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ పవర్ ఉంటేనే వందల కోట్లు సాధ్యమనే అభిప్రాయాన్ని కాంతార పూర్తిగా బద్దలు కొట్టింది. అసలు బయటి వాళ్లకు పరిచయమే లేని రిషబ్ శెట్టి లాంటి చిన్న హీరో ఈ స్థాయిలో మైలురాళ్ళు అందుకోవడం చూస్తే కంటెంట్ కున్న బలమేంటో అర్థమవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఓటిటిలో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో. ఈ నెలాఖరుకు రావొచ్చు.