బాక్సాఫీస్ దగ్గర ఊహించని ఊచకోత చేసిన కాంతార ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ముందు అక్టోబర్ మూడో వారమన్నారు. జరగలేదు. నవంబర్ ఫస్ట్ వీక్ గ్యారెంటీ అనే ప్రచారం జరిగింది. అదీ అవ్వలేదు. ప్రతి వారం ఎదురు చూసే కొద్దీ అక్కడ థియేటర్లలో కలెక్షన్లు బాగున్నాయి కానీ డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడు ఉంటుందో అర్థం కాక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఎట్టకేలకు వాళ్ళ నిరీక్షణ ఫలించింది. అమెజాన్ ప్రైమ్ లో కాంతార వచ్చే గురువారం అంటే 24న తేదీ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కాని మరికొద్ది రోజుల్లో ప్రకటించవచ్చు.
నిజానికి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ యాభై రోజులు పూర్తి చేసుకున్న తర్వాతే ఓటిటిలో రావడం సబబు. అందుకే ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ని ప్రత్యేక విన్నపం మీద కాంతార నిర్మాతలు వాయిదా వేయించారనే టాక్ ఉంది. కర్ణాటకలో 175 కోట్ల గ్రాస్ తో పాటు కెజిఎఫ్ 2ని దాటేసిన ఈ గ్రామీణ అద్భుతం శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ తెలుగు వెర్షన్ కే మూడున్నర కోట్లు ఇచ్చి తీసుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి స్టార్ అట్రాక్షన్ లేని ఒక డబ్బింగ్ మూవీకి ఈ స్థాయి రేట్ పలకడం ఇదే మొదటిసారి. ఒకవేళ రిలీజ్ కు ముందు కనక అమ్మాలని ప్రయత్నించి ఉంటే కనీసం కోటి కూడా వచ్చేది కాదు. ఒక్కోసారి ఆలస్యాలు కూడా మంచే చేస్తాయి.
కాంతారకు అదే జరిగింది. హోంబాలే ఫిలిమ్స్ సినిమాలన్నీ ప్రైమ్ కే ఇస్తున్నారు. కెజిఎఫ్ రెండు భాగాలతో పాటు నెక్స్ట్ ప్రభాస్ సలార్ కూడా వీళ్ళకే డీల్ జరిగిందట. ప్రైమ్ లో వచ్చాక కాంతార మీద సోషల్ మీడియా అభిప్రాయాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద భీభత్సంగా ఆడిన సినిమాలకు నెటి జెన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. సీతారామం, బింబిసార, పొన్నియన్ సెల్వన్ 1, జాతిరత్నాలు ఇవన్నీ డిజిటల్ వచ్చాక మిశ్రమ స్పందన దక్కించుకున్నవే. కాంతార దీనికి మినహాయింపుగా నిలుస్తుందా లేక తన కల్ట్ స్టేటస్ ని అక్కడా నిలబెట్టుకుంటుందా వేచి చూడాలి. సో ఇంకో వారం రోజుల్లో కాంతార ఇంటికి వచ్చేస్తోంది.