వరల్డ్ వైడ్ సినిమాల్లో బెస్ట్ ఏవి తెలుసుకోవడానికి మూవీ లవర్స్ ఎక్కువగా ఫాలో అయ్యేది ఐఎండిబినే. అదేమీ అత్యున్నత ప్రామాణికం అని చెప్పలేకపోయినా ఉన్నవాటిలో ఎక్కువ గుర్తింపు, క్రెడిబిలిటీ ఉన్నది దానికే. అందుకే ప్రమోషన్లు చేసుకునే టైంలో టీమ్ లు వీటిని ప్రత్యేకంగా హైలైట్ చేసుకోవడం చాలాసార్లు చూశాం. సాధారణంగా ఈ రేటింగ్స్ ని ప్రపంచవ్యాప్త చిత్రాలకు కలిపి టాప్ 250 లిస్టుని తయారు చేస్తారు. ఈసారి కేవలం ఇండియన్ మూవీస్ తో ప్రత్యేకంగా జాబితా విడుదల చేశారు. అందులో తెలుగు తమిళ మలయాళం కన్నడతో సహా అన్ని బాషలవి ఉన్నాయి. ప్రత్యేకంగా టాలీవుడ్ నుంచి ఏవేవి ఎక్కువ రేటింగ్ తో ఉన్నాయో ఓ లుక్ వేద్దాం.
కేరాఫ్ కంచరపాలెం, జెర్సీ, మహానటి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అర్జున్ రెడ్డి, దృశ్యం, బాహుబలి 2 ది కంక్లూజన్, బొమ్మరిల్లు, రంగస్థలం, పెళ్లి చూపులు, క్షణం, గూఢచారి, మేజర్, వేదం, ఆర్ఆర్ఆర్, ఒక్కడు, పోకిరి, మనం, ఊపిరి, హ్యాపీ డేస్ ఇందులో ఉన్నాయి. మనతో పోల్చుకుంటే తమిళంవి ఎక్కువగా ఉన్నాయి. కేవలం ఆన్ లైన్ యుజర్స్ ని ప్రాతిపదికగా తీసుకుని డిసైడ్ చేసిన లిస్టు కాబట్టి దీన్ని పూర్తిగా సమర్ధించలేం. కళాతపస్వి ఆవిష్కరించిన ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇందులో లేవు. రుద్రవీణ, ఆదిత్య 369, శివ, ప్రేమ లాంటి క్లాసిక్స్ కి చోటు దక్కలేదు. అసలు మాయాబజార్ ప్రస్తావనే లేదు ఇక దానవీర శూరకర్ణ గురించి ఎలా ఆశించగలం
అడవి శేష్ వి ఇందులో మూడు ఉండటం గమనార్హం. కమర్షియల్ సినిమాలకూ ఇందులో పెద్ద చోటు ఇచ్చారు. బాషా, నరసింహ లాంటివి ప్లేస్ దక్కించుకున్నాయి. హిందీలో అమితాబ్ వి ఎక్కువగా కనిపించగా గత పదిహేనేళ్లలో వచ్చిన వాటికే నెటిజెన్లు అధిక శాతం ఓట్లు వేశారు. అంత ఫీలవ్వడానికి ఇదేం ఆస్కార్ పురస్కారం కాకపోయినా ఇంటర్ నెట్ ప్రపంచంలో ఐఎండిబికి ఉన్న గుర్తింపు ఎక్కువ కాబట్టి వీటి మీద ఇంత మాత్రం చర్చ జరుగుతోంది. టాప్ 1లో కాంతార ఉండగా, 50లో గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, 100లో రంగ్ దే బసంతి, 150లో వాస్తవ్ ది రియాలిటీ, 200లో హిందీ మీడియం, 250 లాస్ట్ ప్లేస్ లో వేలై ఇల్ల పట్టతారి( తెలుగు డబ్బింగ్ విఐపి)ఉన్నాయి.