కాలం ఎప్పుడైనా మల్టీ స్టారర్స్ కు ఉండే క్రేజే వేరు. అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కలిసి నటిస్తే తెరమీద చూస్తున్నప్పుడు ఆ ఆనందమే వేరు. 1978 సంవత్సరం. విజయనిర్మల దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు. పెద్ద ఇమేజ్ ఉన్న ఇద్దరు కథానాయకులు దానికి కావాలి. తనతో పాటు శోభన్ బాబు అయితే బాగుంటుందని భావించి రచయిత మహారథిని పంపించి ఆయనకు వినిపించారు. ముందు ఓకే చెప్పిన అందాల నటుడు తర్వాత ఏవో కారణాల వల్ల తప్పుకున్నారు. కొన్ని విబేధాల దృష్ట్యా ఎన్టీఆర్ చేసే అవకాశం తక్కువ. ఏఎన్ఆర్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ మనసులో ఒప్పుకుంటారా అనే సందేహం.
ఎందుకంటే 1970లో అక్కా చెల్లెలు తర్వాత ఈ కాంబినేషన్ సాధ్యపడలేదు. తను ఎంతో వ్యయప్రయాసలతో దేవదాసు నిర్మిస్తే పాత దేవదాసుని అక్కినేని కావాలని సెకండ్ రిలీజ్ చేసి కృష్ణను దెబ్బ కొట్టారని అప్పటి పత్రికల్లో వచ్చాయి. ఆ కారణంగానే వీళ్ళ మధ్య మాటలు లేవని చెప్పుకునేవారు. కానీ కృష్ణ అడగ్గానే ఏఎన్ఆర్ ఆలోచించలేదు. కథ నచ్చితే హ్యాపీగా కలిసి నటిద్దామని చెప్పారు. దీంతో విజయనిర్మల అప్పటికప్పుడు మహారథి వెంటపడి ఫుల్ వెర్షన్ తయారు చేయించి గ్రీన్ సిగ్నల్ ఇప్పించేసుకున్నారు. విజయనిర్మల ఒక హీరోయిన్ కాగా మరొకరిగా జహీన వాహబ్ నటించారు. సంగీత దర్శకులు రమేష్ నాయుడు హిట్ సాంగ్స్ కంపోజ్ చేశారు.
ఛాయాగ్రహణం బాధ్యతలు గోపికృష్ణ నిర్వహించారు. బడ్జెట్ విషయంలో కృష్ణ దంపతులు రాజీ పడలేదు. క్లైమాక్స్ కోసం హెలికాఫ్టర్, ట్రైన్ అవసరమైతే లక్షలాది రూపాయల అద్దెతో వాటిని సమకూర్చుకున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ల స్ఫూర్తితో హేమాహేమీలు కథ రాసుకున్నప్పటికీ మాస్ ని మెప్పించేందుకు కావాల్సినంత డ్రామా, కమర్షియల్ అంశాలను పుష్కలంగా జోడించారు విజయనిర్మల. ఇందులో ఏఎన్ఆర్ డ్యూయల్ రోల్ పోషించడం విశేషం. 1979 మార్చి 23న అదిరిపోయే ఓపెనింగ్స్ తో రిలీజైన హేమాహేమీలు ఫ్యాన్స్ అంచనాలను అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. కొన్ని కేంద్రాల్లో అల్ టైం కలెక్షన్ రికార్డులు కూడా దక్కాయి.