iDreamPost
android-app
ios-app

ఇలాంటి వాళ్లు చాలా అరుదు.. అస్సలు వదులుకోవద్దు!

ఇలాంటి వాళ్లు చాలా అరుదు.. అస్సలు వదులుకోవద్దు!

మన జీవితం ఓ రైలు ప్రయాణం లాంటిది.. ఈ ప్రయాణంలో ఎంతో మంది మన జీవితంలోకి వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. అయితే, కొద్ది మంది మాత్రమే మనతో పాటు చివరి గమ్యం వరకు ప్రయాణం చేస్తారు. అలాంటి వారే మనకు మంచి స్నేహితులు, అంతకు మించిన వారు అవుతారు. అయితే, జీవితమనే ఈ రైలు ప్రయాణంలో మనతో పాటు చివరి వరకు ప్రయాణం చేసే వారిలో ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని అస్సలు వదలుకోకూడదు. అలాంటి వారి వల్లే మన జీవితం సంతోషమయం అవుతుంది. వారి వల్లే మన జీవితానికి ఓ అర్థం ఉంటుంది. మీ కోసం ఈ కింది పనులు చేసే వారిని అస్సలు వదులకోవద్దు.

షరతులు లేని మద్దతు

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా మనతో పాటు ఉండే వారు చాలా కొద్ది మంది ఉంటారు. అలాంటి వారు మనకు సాయం చేస్తారు తప్ప.. మన నుంచి ఏమీ ఆశించరు. మన బాధల్ని వింటారు.. వీలైనంత సాయం తప్పక చేస్తారు. వెన్ను తట్టి ధైర్యం చెప్తారు. మన కష్టమైన రోజుల్ని కూడా చాలా ఈజీగా ముగిసేలా చేస్తారు.

ప్రోత్సాహం అందించేవారు.. మనల్ని మోటివేట్‌ చేసేవారు

మనల్ని నిజంగా ప్రేమించే లేదా ఇష్టపడేవాళ్లే మన ఉన్నతిని మనస్పూర్తిగా కాంక్షిస్తారు. మనపై మన కంటే ఎక్కువగా వారికే నమ్మకం ఉంటుంది. ఆశయాన్ని సాధించే విషయంలో ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు. ఎప్పుడూ మోటివేట్‌ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మనపై మనకు నమ్మకం వచ్చేలా చేస్తుంటారు.

నిజాయితీ, పారదర్శకత!

ఏ రిలేషన్‌ అయినా కలకాలం సాగడానికి నమ్మకం అనేది బలమైన పునాది. నమ్మకమనే పునాదుల గోడలమీదే ఏ బంధమైన కలకాలం సాగుతుంది. మనల్ని ఇష్టపడే వాళ్లు.. మనల్ని ప్రేమించేవాళ్లు మనతో ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు. అది ఎంత కష్ట సమయంలోనైనా సరే. ఇలాంటి వాళ్లు ఏ విషయంలోనూ మనల్ని తల దించుకునేలా చేయరు.

హద్దుల్లో ఉంటారు..

మన వ్యక్తిగత హద్దులు తెలిసిన వారు.. వారి హద్దుల్లో వారు ఉండి మన వ్యక్తిగత స్వేచ్చను గౌరవించే వారు ఎంతో విలువైన వారు. ప్రతీ మనిషికి కొంత వ్యక్తగత స్వేచ్ఛ అవసరం అని వీళ్లు భావిస్తారు. వీళ్లు ఎప్పుడూ తమ వ్యక్తిగత అభిప్రాయాలను, ఐడియాలను ఇతరులపై రుద్దరు.

మన విజయమే వారి విజయం..

మన విజయాన్ని వారి విజయంగా భావించే వారు మన జీవితంలో అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. మన విజయంతో ఎదుటి వ్యక్తి సంతోషం కలుగుతోంది అంటే.. ఆ వ్యక్తిని అస్సలు వదులుకోకూడదు. మనల్ని ఎంతో ఇష్టపడే వారే మన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి జలసీకి పోకుండా మన విజయాన్ని సెలెబ్రేట్‌ చేస్తారు.

క్షమ, అర్థం చేసుకునే గుణం..

తప్పులు చేయటం మానవ సహజం. ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్‌ఫెక్ట్‌ కాదు. మనల్ని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో.. వారు మన తప్పుల్ని తొందరగా క్షమించారు. మనల్ని అర్థం చేసుకుంటారు. క్షమ, అర్థం చేసుకునే గుణం ఉన్న వారే మనకు నిజమైన ఆప్తులు. ఈ రెండూ ఉంటే ఆ బంధం కలకాలం సాగుతుంది.