iDreamPost
android-app
ios-app

మలయాళం రీమేకులు – ఇక ఆలోచించాల్సిందే..!

మలయాళం రీమేకులు – ఇక ఆలోచించాల్సిందే..!

ఏదైనా భాషలో ముఖ్యంగా మలయాళంలో సినిమా హిట్టయితే చాలు వెంటనే రీమేక్ హక్కులు కొనేసుకోవడం ఇక్కడి స్టార్లతో తీసేయడం పరిపాటిగా మారుతోంది. మన ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు అవి సెట్ అవుతాయా లేదానేది కూడా ఆలోచించుకోవడం లేదు. ఇటీవలే వచ్చిన గాడ్ ఫాదర్ మొదటి నాలుగు రోజులు ఎంత దూకుడు చూపించినప్పటికీ ఆ తర్వాత అనూహ్య రీతిలో కలెక్షన్లలో విపరీతమైన డ్రాప్ చూపించడం ఊహించని పరిణామం. ఆ మధ్య పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సైతం తొంబై కోట్ల దాకా వసూలు చేసిందని చెప్పుకున్నారు కానీ వాస్తవానికి చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాని మాట వాస్తవం. ఈ రెండు సినిమాల ఒరిజినల్ వెర్షన్లు ఓటిటిలో ఉండటం చాలా చేటు చేసింది.

పెద్ద స్టార్లే కాదు చిన్న హీరోలతోనూ ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. కప్పేలాని బుట్టబొమ్మగా తీస్తున్నారు. అనీఖా సురేంద్రన్ టైటిల్ రోల్ లో షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. మంచు విష్ణు ఆండ్రాయిడ్ కట్టప్ప రైట్స్ కొనేసి తండ్రి మోహన్ బాబుతో తీసేందుకు ప్లానింగ్ లో ఉన్నాడు. దీని డబ్బింగ్ ప్రింట్ ఆల్రెడీ ఆహా యాప్ లో ఉంది. హెలెన్ ని సైతం తీయాలనుకున్నారు కానీ చివరికది హిందీలో జాన్వీ కపూర్ తో పూర్తి చేసి రిలీజ్ కూడా రెడీగా ఉంచారు. ఇవన్నీ కమర్షియల్ మీటర్ కు దూరంగా ఉండే సినిమాలు. థియేట్రికల్ గా జనం రిసీవ్ చేసుకోవడం అంత సులభంగా ఉండదు. పైగా మార్పులు చేస్తే ఒక తంటా చేయకపోతే ఒక తంటాలా ఉంది పరిస్థితి.

మల్లువుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ప్రేమమ్ ఇక్కడ జస్ట్ హిట్ దగ్గర ఆగిపోయింది. ఇప్పుడే కాదు ఈ ట్రెండ్ 90 దశకం ఉంచే ఉంది. మోహన్ బాబుకి పెద్ద బ్రేక్ ఇచ్చిన అల్లుడుగారు, నిర్మాత ఏఎం రత్నంకు డైరెక్టర్ గా మంచి డెబ్యూగా నిలిచిన పెద్దరికం, చిరంజీవికి పర్ఫెక్ట్ కంబ్యాక్ గా పేరు తెచ్చుకున్న హిట్లర్, వెంకటేష్ కు మరో ఫ్యామిలీ హిట్ వచ్చేలా చేసిన దృశ్యం ఇవన్నీ కేరళ నుంచి తెచ్చిన మాలే. అన్నీ సక్సెస్ ఫుల్ మూవీసే. కానీ ఇవి వచ్చే టైంకి ఇప్పటికి ప్రేక్షకుల అభిరుచుల్లో టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. రీమేక్ ఆలస్యం చేస్తే దాని మీద ఆసక్తి తగ్గిపోతోంది. అందుకే ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎదురు దెబ్బలు తప్పవు.