ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో రెండు పెద్ద హీరోల సినిమాలు క్యాన్సిల్ కాబోతున్నాయని అవి జూనియర్ ఎన్టీఆర్. మహేష్ బాబువేననే ప్రచారం జోరుగా జరిగింది. దీంతో ఇది నిజమేనని భావించిన అభిమానులు టెన్షన్ పడ్డారు. వాస్తవానికి ఇవన్నీ పుకార్లే. విపరీతమైన జాప్యం జరగడం వల్ల ఇలాంటి గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి తప్ప ఎలాంటి నిజం లేదు. ముందు మహేష్ మూవీ సంగతి చూస్తే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ ని ఎప్పుడో పూర్తి చేశారు. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక చిన్న బ్రేక్ ఇచ్చిన క్రమంలో ఇందిరా దేవి గారు కన్నుమూయడం, ఆ కార్యక్రమం ముగిశాక ఆ దిగులు నుంచి బయటపడేందుకు మహేష్ ఒంటరిగా విదేశాలకు వెళ్లడం జరిగాయి.
తిరిగి రావడం ముందే ఫిక్స్ చేసుకుని ఈ రోజు రిటర్న్ అయ్యారు. నిర్మాత నాగ వంశీ అతి త్వరలోనే రీ స్టార్ట్ చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చేశారు. సో ఇక ఎలాంటి అనుమానం అక్కర్లేదు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మరో కథానాయికను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇక యంగ్ టైగర్ కొరటాల శివ కాంబో ప్రాజెక్టు విపరీతమైన లేట్ అవ్వడం ఎవరూ కాదనలేరు. ఆర్ఆర్ఆర్ రిలీజై ఏడు నెలలు దాటుతున్నా తారక్ ఇంకా సెట్స్ లోకి అడుగు పెట్టలేదు. ఆచార్య తాలూకు లావాదేవీలు పూర్తి చేసుకుని ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసే క్రమంలో కొరటాల కొంత ఎక్కువ టైం కోరుకోవడం వల్లే ఇది జరిగింది.
ఇప్పుడు రూట్ క్లియర్ అయ్యింది. కెమెరామెన్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తో కలిసి కొరటాల మొదటి దఫా చర్చలు పూర్తి చేశారు. జూనియర్ జపాన్ నుంచి తిరిగి వచ్చాక చిన్న గ్యాప్ ఇచ్చేసి రెగ్యులర్ షూట్ మొదలుపెడతారు. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ నెలాఖరులోపే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేస్తారు. అరవింద సమేత వీర రాఘవ వచ్చి నాలుగేళ్లు అవుతున్న నేపథ్యంలో తమ హీరోని సోలోగా సినిమాలో చూడాలని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. కాకపోతే విడుదలకు మాత్రం ఇంకో ఏడెనిమిది నెలలు ఎదురు చూడక తప్పదు. ఫైనల్ గా మహేష్ 28, ఎన్టీఆర్ 30 ఈ రెండింటిలో ఏదీ రద్దు కాలేదన్నది ఫ్యాన్స్ కి ఊరటనిచ్చే విషయం.