విద్యార్థులకు భారీ శుభవార్త.. కేంద్రం నుంచి ఫ్రీగా 25 వేలు.. ఇలా చేస్తే చాలు

Vidyarthi Vigyan Manthan VVM 2024-25: విద్యార్థులు ఉచితంగా 25 వేల రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి ఇందుకు స్టూడెంట్స్‌ ఏం చేయాలి.. ఎవరు అర్హులు అంటే..

Vidyarthi Vigyan Manthan VVM 2024-25: విద్యార్థులు ఉచితంగా 25 వేల రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి ఇందుకు స్టూడెంట్స్‌ ఏం చేయాలి.. ఎవరు అర్హులు అంటే..

విద్యార్థులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సాహించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకువస్తోన్న సంగతి తెలిసిందే. చదువులో మంచి ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్‌షిప్‌ రూపంలో ఆర్థిక సాయం అందజేస్తున్నాయి. అలానే విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా వారు అన్ని రంగాల్లో రాణించేలా వారి కోసం రకరకాల కార్యక్రమాలను తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం బంపరాఫర్‌ ప్రకటించింది. దీనిలో భాగంగా వారు ఉచితంగా 25 వేల రూపాయలు పొందే అవకాశం ఉంది. మరి ఈ భారీ మొత్తం పొందాలంటే విద్యార్థులు ఏం చేయాలి.. దేని కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం ఇస్తుంది వంటి పూర్తి వివరాలు మీ కోసం..

విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా.. పరిశోధన, ప్రయోగాల్లో రాణించేలా వారిని ప్రోత్సాహించడం కోసం ఏటా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచార సంస్థ ఆధ్వర్యంలో ఎన్సీఈఆర్టీ, విజ్ఞాన్ ప్రసాద్, విజ్ఞాన భారతి సంయుక్తంగా వీవీఎం పేరిట ప్రతి సంవత్సరం ఈ ప్రతిభాన్వేషణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరు నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. ఈ పోటీల్లో పాల్గొనే స్టూడెంట్స్‌కి.. రాష్ట్ర విద్యా బోర్డు, సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ వారు ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. ఇక ఈ పరీక్షలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉంటాయి.

ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందేందుకు అర్హత సాధిస్తారు. ఇక ఈ పోటీ పరీక్షను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తారు. 6-8 తరగతులకు జూనియర్ లెవల్‌గా నిర్ణయించగా.. 9-11 తరగతులకు సీనియర్ లెవల్‌గా గుర్తిస్తారు. రెండు గ్రూపులకు వేర్వేరుగా పరీక్ష పెడతారు. ఈ ఎగ్జామ్‌ తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉంటుంది. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారికి నచ్చిన భాషల్లో పరీక్ష రాయవచ్చు.

రాష్ట్ర స్థాయి ఎంపిక విధానం ఇలా..

పాఠశాల స్థాయి నుంచి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా అంటే ఆరు నుంచి 11 వ క్లాస్‌ వరకు.. అత్యుత్తమ ప్రతిభ చూపిన మొదటి 20 మందిని స్టేట్‌ లెవల్‌కి ఎంపిక చేస్తారు. అంటే 6-11 తరగతులకు కలిపి మొత్తం 120 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఈ 120 మందికి మరోసారి పరీక్ష పెట్టి.. దానిలో ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 18 మందిని జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి పరీక్ష నవంబర్ 26 లేదా డిసెంబర్ 3,10,17 తేదీల్లో ఉండనుందని సమాచారం. రాష్ట్ర స్థాయిలో ప్రతి తరగతి నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, 2 వేలతో పాటు మెమెంటో, సర్టిఫికెట్ అందజేస్తారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మెమెంటో, ప్రశంసాపత్రం అందజేస్తారు.

జాతీయ స్థాయికి ఇలా..

రాష్ట్ర స్టాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించి.. ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన మొదట ముగ్గురు విద్యార్థుల చొప్పున 18 మందిని జాతీయ స్థాయి విజేతలుగా ప్రకటిస్తారు. జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరుసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రం అందజేస్తారు. ఇక ఈ ఏడాదికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు పూర్తి వివరాల కోసం https://vvm.org.in/   సందర్శించండి.

Show comments