Dharani
Summer Holidays: వేసవి సెలవుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న విద్యార్థులు మరొక్క రోజు ఆగితే చాలు.. ఇక పండగ చేసుకోవచ్చు. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు..
Summer Holidays: వేసవి సెలవుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న విద్యార్థులు మరొక్క రోజు ఆగితే చాలు.. ఇక పండగ చేసుకోవచ్చు. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు..
Dharani
ఏడాది పాటు పుస్తకాలు, పరీక్షలతో కుస్తీ పట్టిన విద్యార్థులు.. వేసవి సెలవుల్లో హాయిగా ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. పెద్దలే ఆ వేడిని తట్టుకోలేకపోతున్నారు.. ఇక చిన్నారుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో.. ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే పది, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. అలానే మిగతా క్లాస్‌ల వారికి కూడా పరీక్షలు అయిపోయాయి. ఇక వేసవి సెలవుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తోన్న విద్యార్థులకు శుభవార్త. రేపు ఒక్కరోజు పాఠశాలలకు వెళ్తే.. ఎల్లుండి నుంచి 50 రోజుల పాటు ఎంజాయ్ చేయవచ్చు. తెలంగాణలో ఎల్లుండి నుంచి అనగా ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు…
రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. మార్చి 15 నుంచి తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్ మొదలయ్యాయి. ఏప్రిల్ 23తో ఇవి ముగియనున్నాయి. రేపే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు లాస్ట్ వర్కింగ్‌డే. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. నేడు అనగా సోమవారం నాడు సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు జరగనున్నాయి.
రేపు అనగా ఏప్రిల్ 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి.. ఆన్‌లైన్ ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తారు. ఇక బుధవారం అనగా.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సుమారు 50 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు. ఆ తర్వాత జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ఓపెన్ కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇంటర్ కాలేజీల విషయానికొస్తే.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో మార్చి 30 వ తేదీ నుంచే కాలేజీలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30 నుంచి మే 31 వరకు కొనసాగుతాయి. అంటే సుమారుగా రెండు నెలలు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు. జూన్ 1న కాలేజీలు రీఓపెన్ కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అక్కడ మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి. ఏపీలో కూడా ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. జూన్ 12 న పాఠశాలలు తిరిగి ఒపెన్ చేస్తారు. ఇప్పటికే ఇంటర్ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రారంభం అయ్యాయి. మే 31 వరకు ఇవి కొనసాగనున్నాయి. జూన్ 1 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయి.
ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మే నెల రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక జూన్ మూడో వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అదే జరిగితే.. పాఠశాలలలకు సమ్మర్ హలీడేస్ను పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అప్పటి పరిస్థితిని బట్టి దీనిపై నిర్ణయం అధికారులు నిర్ణయం తీసుకుంటారు.