Dharani
AP RGUKT IIIT: పదో తరగతి పాసయ్యారా.. ఇంటర్‌లో జాయిన్ కావడం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ప్రభుత్వం మీకో అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. ఉచితంగా ఇంటర్ చదవడమే కాక ఐఐఐటీలో చేరు ఛాన్స్ ఇస్తోంది. ఆ వివరాలు..
AP RGUKT IIIT: పదో తరగతి పాసయ్యారా.. ఇంటర్‌లో జాయిన్ కావడం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ప్రభుత్వం మీకో అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. ఉచితంగా ఇంటర్ చదవడమే కాక ఐఐఐటీలో చేరు ఛాన్స్ ఇస్తోంది. ఆ వివరాలు..
Dharani
రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంటర్ పూర్తి చేసిన వారు.. డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్షలు రాయడం.. అప్లై చేయడం చేస్తున్నారు. ఇక పదో తరగతి విద్యార్థులు ఇంటర్లో ఏ కోర్స్ చదవాలి.. ఎక్కడ జాయిన్ కావాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు భారీ శుభవార్త. వారు ఉచితంగా ఇంటర్ చదివే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాదండోయ్.. ఇంటర్ తర్వాత ఏకంగా ఐఐఐటీలో కూడా చేరవచ్చు. ఇంతకు ఏంటా కోర్సు.. ఎలా అప్లై చేసుకోవాలి.. అర్హతలు ఏంటి వంటి వివరాలు మీ కోసం..
ఆర్థిక కష్టాలు, పేదరికం కారణంగా ఏ ఒక్కరు ఉన్నత విద్యాకు దూరం కాకూడదని మహా నేత వైఎస్సార్ భావించారు. ఆయన ఆలోచనలోంచి పుట్టుకొచ్చినవే..ఏపీ ట్రిపుల్ ఐటీలు. ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉన్నత విద్య, అందులోనూ సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్‌లు ఇవి. వీటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ఆర్‌జీయూకేటీ) పేరుతో.. యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇవి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి.
ఈ క్రమంలో రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల బీటెక్ సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకుగాను.. వర్సిటీ ఈ నెల 6న నోటిఫికేషన్ ప్రకటించింది. ఒక్కో సెంటర్‌లో 1,000 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 100 సీట్లు ఉన్నాయి.
ఈ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఈ నెల అనగా మే 8 నుంచి జూన్ 25 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ప్రవేశాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ–ఏకు 7, బీసీ–బీకి 10, బీసీ–సీకి 1, బీసీ–డీకి 7, బీసీ–ఈకి 4 శాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేస్తారు. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 5 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థులకు 1 శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి కేటగిరీలోనూ 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.
ఆర్జీయూకేటీలో సీట్లు పొందాలంటే.. అభ్యర్థులు ప్రథమ ప్రయత్నంలోనే అనగా.. 2024లో ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. వారి వయస్సు 31–12–2024 నాటికి 18 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే 21 ఏళ్లు నిండకుండా ఉండాలి.
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ఆర్జీయూకేటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ హైస్కూళ్లు, మున్సిపల్ హైస్కూళ్లలో చదివిన విద్యార్థులకు వారి మార్కులకు 4 శాతం డిప్రెవేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. దీనిని సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వెయిటేజీగా పేర్కొంటారు. 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.
ఏపీ ట్రిపుల్ ఐటీల విద్యా విధానం చాలా కొత్తది అని చెప్పవచ్చు. మొత్తం ఆరేళ్ల వ్యవధిగల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌లో.. తొలి రెండేళ్లను పీయూసీ(ఇంటర్మీడియెట్ తత్సమాన) కోర్సుగా పరిగణిస్తారు. ఆ తర్వాత నాలుగేళ్ల బీటెక్ ప్రోగ్రామ్ బోధన కొనసాగుతుంది. ఒక్కసారి వీటిల్లో సీటు వస్తే.. ఆరేళ్ల పాటు ఉచితంగా చదువుకోవచ్చు.