Dharani
Tholi Ekadashi 2024-Do This Remedy: ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై 17, బుధవారం నాడు వస్తుంది. ఈ రోజున చిన్న పని చేస్తే.. మీ ఇంట సిరిసంపదలు కురుస్తాయని పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు..
Tholi Ekadashi 2024-Do This Remedy: ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై 17, బుధవారం నాడు వస్తుంది. ఈ రోజున చిన్న పని చేస్తే.. మీ ఇంట సిరిసంపదలు కురుస్తాయని పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు..
Dharani
ఉగాది, శ్రీరామ నవమి పండగలు అయిపోయాక.. నెలల గ్యాప్ తర్వాత వచ్చే పర్వదినం తొలి ఏకాదశి. ఈ పండుగకు హిందువులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పురాణాల్లో కూడా ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక ప్రతి నెలా రెండు సార్లు ఏకాదశి తిథి వస్తుంది. చాలా మంది ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. అయితే ప్రతి ఏకాదశికి తన సొంత ప్రాముఖ్యత ఉంటుంది. దీనిలో భాగంగానే ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. ఈ రోజు నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది.
తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని.. తిరిగి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజునే మేల్కొంటాడని నమ్ముతారు. ఈ సమయంలో విశ్వాన్ని నడిపే బాధ్యత శివుడి మీద పడుతుందని భావిస్తారు. దీనిలో భాగంగా ఈ నాలుగు నెలలు వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిర్వహించరు.
ఈ నాలుగు నెలలు శివుడు విశేష పూజలందుకుంటాడు. ఇక ఈ ఏడాది తొలి ఏకాదశి.. జూలై 17, బుధవారం నాడు వచ్చింది. ఈ పర్వదినం నాడు చాలా మంది ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి తేదీ 16 జూలై 2024 రాత్రి 8:33 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జూలై 17వ తేదీ రాత్రి 9:02 గంటలకు ముగుస్తుంది. కనుక తొలి ఏకాదశి ఉపవాసం జూలై 17, 2024 బుధవారం రోజున చేయాల్సి ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఉన్న వారు ద్వాదశి నాడు ఉపసంహరించాలి.
ఇక ఈ ఏకాదశి నాడు చేసే కొన్ని పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా లక్ష్మీ దేవి ఆశీస్సులు లభించి.. సిరి సంపదలు కురుస్తాయని అంటున్నారు. దీనిలో భాగాంగా తొలి ఏకాదశి నాడు.. సాయంత్రం పూట చెట్టు కింద దీపం వెలిగిస్తే.. విశేష ఫలితం ఉంటుంది అంటారు. ఎందుకంటే ఈ రోజున శ్రీమహావిష్ణువు.. రావి చెట్టుపై కూర్చుంటాడని పురాణాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా తొలి ఏకాదశి నాడు.. రెండు రూపాయలు తీసుకుని.. దేవుడి పూజలో ఉంచుకోవాలి. ముందుగా భగవంతుడిని పంచామృతంతో అభిషేకించాలి. ఆపై లక్ష్మీదేవి ప్రతిమ, పటం ముందు రెండు రూపాయలను ఉంచి పూజ చేయాలి. దీని వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. తొలి ఏకాదశి నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే.. మీ ఇంట్లో ఐశ్వర్యం, ఆనందానికి లోటు ఉండదు అంటున్నారు పండితులు. అలానే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి.. రాత్రి జాగారం చేస్తే.. ఎన్నో లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం.. పండితులు సూచన మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని ఐడ్రీమ్ మీడియా నిర్ధారించలేదు.