iDreamPost
android-app
ios-app

వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.. కారణం ఏంటంటే

  • Published Sep 27, 2023 | 2:16 PM Updated Updated Nov 02, 2023 | 11:06 PM
  • Published Sep 27, 2023 | 2:16 PMUpdated Nov 02, 2023 | 11:06 PM
వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.. కారణం ఏంటంటే

హిందువులు చేసుకునే పండగల్లో.. వినాయక చవితికి చాలా ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా గణనాథుడికి పూజలు చేస్తారు. మండపాలు వేసి.. అందంగా అలంకరించి.. ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసి.. ఆ తర్వాత గంగమ్మ ఒడికి సాగనంపుతారు. అయితే హిందూ దేవుళ్లల్లో ఎవరికి పూజలు చేసినా సరే.. ఆ తర్వాత ఆయ దేవీదేవతలకు ఉద్వాసన చెప్పి.. ఇంట్లోనే ఉంచుకుంటాము. కానీ వినాయకుడి విషయంలో మాత్రం… ఇలా కాదు. తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు చేసి.. ఆ తర్వాత గణపయ్య ప్రతిమలను నిమజ్జనం చేస్తాము. ఈ క్రమంలో చాలా మందికి ఓ సందేహం వస్తుంది. మిగతా దేవుళ్లను ఇంట్లోనే ఉంచుతాము.. కానీ వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు అని. మరి దీని వెనక కారణం ఏంటి అంటే..

ప్రతి ఏటా భాద్రపదమాసంలో.. చవితి రోజున వినాయక చవితి పండుగ జరుపుకుంటాము. ఇక భాద్రపద మాసం అంటే.. ప్రకృతి అంతా పచ్చగా.. ఎంతో అందంగా కనిపిస్తుంది. అప్పటి వరకు వేసవి తీవ్రత కారణంగా బీటలు వారిన భూమి.. తొలకరి చినుకులు తగిలి.. పచ్చదనాన్ని తిరిగి సంతరించుకుంటుంది. ఇక వర్షాల వల్ల నదులన్ని జలకళ సంతరించకుని.. పరవళ్లు తొక్కుతుంటాయి. ఇక ఇదే సీజన్‌లో వినాయక చవితి వస్తుంది. గణపతి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడికి.. ఆకుపచ్చనివి అంటే చాలా ఇష్టం. అందుకే వినాయక చవితి సందర్భంగా 21 పత్రాలతో ఆయనకు పూజలు చేస్తాము.

ఆధ్యాత్మిక, ఆయుర్వేద కారణాలు..

కొత్త మట్టితో చేసిన వినాయక విగ్రహం వద్ద ఈ 21 పత్రాలు ఉంచడం వల్ల.. వాటి మీదుగా వీచే గాలి.. మనలోని అనారోగ్య సమస్యలని తగ్గిస్తుందని నమ్ముతారు. నవరాత్రులు పూజలందుకున్న తర్వాత వినాయకుడి ప్రతిమతో పాటు ఆకులను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల.. ఈ పత్రిలో ఉండే ఔషధ గుణాలను.. ఆ నీటిని శుభ్రం చేస్తాయని పండితులు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అంతేకాక తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణపయ్య.. వారి కోర్కెలు తీర్చుతాడు. ఇక నవరాత్రి ఉత్సవాలు మూగిశాక.. ఆయనను తిరిగి స్వర్గానికి పంపించడానికి నీరు దగ్గరి మార్గం అని.. అందుకే ఆయనను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారని చెబుతున్నారని పండితులు.

వేదాంత రహస్యం ఇదే..

తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణపయ్యను.. పదవ రోజున నిమజ్జనం చేయడంలో వేదాంత రహస్యం కూడా దాగి ఉంది. భౌతికమైన ప్రతి పదార్థం.. అంటే పంచ భూతాల(భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) నుంచి జన్మించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థాలు.. చివరకు నాశనం కావాల్సిందే. ఇక వాటి జీవిత కాలంలో.. అవి ఎంత వైభవంగా, విలాసవంతమైన జీవితం గడిపినా.. అంతిమంగా మట్టిలో కలవాల్సిందే.

అందుకే ప్రకృతి దేవుడైన గణపతికి.. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు చేసి.. మేళతాళాలతో ఊరేగించి.. చివరకు నీటిలో నిమజ్జనం చేస్తారు. దీని అంతరార్థం ఒకటే.. ఎంత గొప్పగా బతికిన వారైనా సరే.. చివరకు మట్టిలో కలవాల్సిందే. ఈ సత్యాన్ని జనాలకు బోధించడం కోసం వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.

శాస్త్రీయ కారణాలు..

వినాయక నిమజ్జనం వేనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. వినాయక చవితి నాటికి.. జోరుగా వానలు కురిసి.. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగి పొర్లుతుంటాయి. వరదలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక అలాంటి సమయంలో మట్టితో చేసిన గణపయ్య విగ్రహాలను నీళ్లల్లో నిమజ్జనం చేయడం వల్ల.. వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు.

అలానే వానాకాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో గణేష్‌ నిమజ్జనం సందర్భంగా.. ఆయన పూజకు వాడిన ఆకులను కూడా నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు పరిశుభ్రంగా మారుతుందని చెబుతున్నారు. అయితే మట్టి విగ్రహాల నిమజ్జనం వల్ల ప్రకృతికి ఎంత లాభం ఉందో.. పీవీపీ విగ్రహాల నిమజ్జనం వల్ల అన్ని నష్టాలు ఉన్నాయి. కనుక మట్టి విగ్రహాలనే పూజించాలని చెబుతున్నారు.