Mahabubnagar Father, Daughter Dies On July 2rd 2024: భార్య అన్న చిన్న మాటతో ఆ కుటుంబంలో తీరని విషాదం.

భార్య అన్న చిన్న మాటతో ఆ కుటుంబంలో తీరని విషాదం.

భార్య అన్న చిన్న మాట.. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇప్పుడు ఎంత ఏడ్చినా లాభం లేకుండా పోయింది. ఇంతకు ఏం జరిగిందంటే..

భార్య అన్న చిన్న మాట.. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇప్పుడు ఎంత ఏడ్చినా లాభం లేకుండా పోయింది. ఇంతకు ఏం జరిగిందంటే..

నేటి కాలంలో మనిషికి విచక్షణ రాను రాను తగ్గిపోతుంది. చిన్న చిన్న కారణాలకే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆవేశంలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. ఆవేశం అనేది మద్యపానం, డ్రగ్స్‌ వ్యసనాల కన్నా ప్రమాదకరంగా మారింది. ఆవేశంలో తీసుకునే చిన్న నిర్ణయం జీవితాలను నాశనం చేస్తుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మన కుటుంబం అయినా నష్టపోవచ్చు.. లేదంటే వేరే వ్యక్తులకు నష్టం కలగవచ్చు. కొన్ని సెకన్ల పాటు.. మనలోని ఆగ్రహాన్ని నిగ్రహించుకోగలిగితే.. ఎన్నో జీవితాలు, కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. లేదంటే మీ మీద ఆధారపడిన వారి జీవితాల్లో అంతులేని విషాదం నింపిన వారు అవుతారు. తాజాగా తెలంగాణలో ఇదే ఘటన వెలుగు చూసింది. భార్య అన్న చిన్న మాట.. ఆ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. చిన్న మాట రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆ వివరాలు..

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ ప్రాంతంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో చోటు చేసుకున్న చిన్న గొడవ.. తండ్రీకూతుళ్ల ప్రాణాలను బలి తీసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్లికి చెందిన శివానంద్(46 ) అనే వ్యక్తి.. జీవనోపాధి కోసం.. కొన్నాళ్ల క్రితం కుటుంబంతో కలిసి మహబూబ్‌నగర్‌ వచ్చాడు. ఇక గత కొన్నాళ్లుగా ఎస్‌వీఎస్‌ ఆస్పత్రిలో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శివానంద్ దంపతులకు ఓ కుమారుడు సాయికృష్ణ, కుమార్తె చందన సంతానం ఉన్నారు. ఇక సాయికృష్ణ ప్రస్తుతం ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కుమార్తె చందన (17) ఎస్వీఎస్‌లోనే డీఎంఎల్టీ చదువుతోంది.

ఇలా ఉండగా.. గత కొన్ని రోజులుగా సాయికృష్ణ.. సెల్‌ఫోన్‌కు అడిక్ట్‌ అయ్యాడు. ఎప్పుడు చూడు దానిలో గేమ్స్‌ ఆడుతూ కూర్చునేవాడు. ఇది గమనించిన శివానంద్‌.. ఫోన్‌ పక్కకు పెట్టి చదువుకోమని కొడుక్కు సూచించాడు. కానీ అతడు మారలేదు. ఈ క్రమంలో మంగళవారం నాడు ఇదే విషయమై.. కొడుకును కాస్త గట్టిగా మందలించాడు శివానంద్‌. దాంతో భార్య జోక్యం చేసుకుని.. కొడుకుని తిట్టవద్దని అడ్డుకుంది. ఈ విషయమై తల్లి, తండ్రి, కుమారుని మధ్య గొడవ జరిగింది. భార్య, బిడ్డలు తన మాట వినడం లేదు.. ఎదురు తిరిగారని భావించి.. తీవ్ర మనస్థాపానికి గురైన శివానంద్‌.. ఆవేశంలో దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

గొడవ తర్వాత ఇంటి నుంచి ఆవేశంగా బయటకు వెళ్లిన శివానంద్‌.. తమ కాలనీకి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌ మీదకు వెళ్లాడు. ఇది గమనించిన కూతురు చందన.. శివానంద్‌ను అనుసరిస్తూ వెళ్లింది. అదే సమయంలో.. పట్టాలపై నుంచి అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలుకు వెళ్తుండగా.. వెళ్లి దానికి అడ్డుగా వెళ్లి నిల్చున్నాడు శివానంద్. అది గమనించిన చందన.. తండ్రిని వారించేందుకు పట్టాలపైకి వెళ్లింది. కానీ లాభం లేకపోయింది. తండ్రీకూతుళ్లిద్దరూ రైలు కింద పడి అక్కడికక్కడే చనిపోయారు.

ఈ విషయం తెలుసుకున్న శివానంద్ భార్య కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంతో తండ్రి తీసుకున్న నిర్ణయం వల్ల కుమార్తె కూడా బలైంది. ఇక భార్య అన్న చిన్న మాట ఖరీదు ఇద్దరి నిండు జీవితాలు.. మరీ ఇంత ఆవేశం పనికి రాదు.. శివానంద్‌ నిర్ణయం వల్ల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది అంటున్నారు.

Show comments