Dharani
Dharani
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దీప్తి మృతి కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న దీప్తి.. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇక అదే రోజు నుంచి.. దీప్తి చెల్లి చందన కనిపించకుండా పోయింది. పైగా సోదరుడికి.. తాను అక్కను చంపలేదని వాయిస్ మెసెజ్ పెట్టడం.. వంటి కీలక పరిణామాల నేపథ్యంలో.. పోలీసులు దీప్తి చెల్లి చందన కోసం గాలించడం ప్రారంభించారు. చందన ఇంటి నుంచి వెళ్లేటప్పుడు పాస్‌పోర్ట్ తీసుకుని వెళ్లడంతో.. ఆమె విదేశాలకు వెళ్లకుండా చూడటం కోసం.. పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు బస్టాండ్ సీసీ కెమెరాల్లో రికార్డ్ కాగా.. వాటి ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో తాజాగా ఈకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
దీప్తి సోదరి చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఇద్దరు హైదరాబాద్ శివారులో పోలీసులకు చిక్కారు. దీప్తి చనిపోయిన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు.. నాలుగు బృందాలుగా ఏర్పడి చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ కోసం గాలింపు చేపట్టగా.. మూడు రోజులకు వారు దొరికారు. అయితే దీప్తి మృతి కేసులో ముందు నుంచి ఆమె చెల్లిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్లు చెప్పే విషయాలు కేసులో కీలకంగా మారబోతున్నాయి. మరోవైపు.. ఈ కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు. అయితే రిపోర్ట్ వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది. ఇక దీప్తి ఒంటిపై గాయాలు, చేయి విరిగిపోయి ఉండటం లాంటి అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
అయితే.. మూడు రోజుల క్రితం ఇంట్లోనే దీప్తి, ఆమె చెల్లెలు చందన కలిసి రాత్రి ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. దీప్తి ఓడ్కా తాగగా.. ఆమె సోదరి బ్రీజర్ తాగింది. అయితే దీప్తి అప్పటికే హాఫ్ బాటిల్ ఓడ్కా తాగటంతో..మత్తులో మునిగి సోఫాలోనే పడిపోయింది. ఆ తర్వాత చెల్లి ఆమెను లేపడానికి ఎంత ప్రయత్నించినా దీప్తి లేవలేదని చందన వాయిస్ మెసేజ్‌లో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఇదే అవకాశం అని భావించిన చందన.. ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు, రూ.90 లక్షలు విలువ చేసే కిలోన్నర బంగారు నగలు, పాస్‌పోర్టు తీసుకుని వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు.
చందన ప్రియుడిని హైదరాబాదీగా పోలీసులు గుర్తించారు. చందన ఫోన్‌కాల్ డేటా ఆధారంగా అతడి వివరాలు సేకరించారు. దీప్తి మృతి చెందని నాటి నుంచి ఇద్దరి సెల్‌ఫోన్లు ఆఫ్‌లో ఉండటంతో.. వారి ఆచూకీ కనుక్కోవటం కొంచెం కష్టమైందని తెలిపారు పోలీసులు. కానీ ఎట్టకేలకు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో.. దీప్తి, చందనకు మద్యం బాటిళ్లు ఎవరు తెచ్చిచ్చారు.. ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు.. దీప్తి చనిపోవడానికి ముందు ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా.. దీనిలో దీప్తి చెల్లి చందన, ఆమె ప్రియుడి పాత్ర ఎంతవరకు ఉంది.. అదే సమయంలో వాళ్లు ఎందుకు పారిపోయారు వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.