కోల్‌కత్తా డాక్టర్‌ కేసు.. తొలి రోజు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? పూర్తి వివరాలు..

Kolkata, Kolkata Doctor Case, CBI, Supreme Court, RG Kar Medical College: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కోల్‌కత్తా డాక్టర్‌ రేప్‌ అండ్‌ మర్డర్’ కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కేసు డే వన్‌నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

Kolkata, Kolkata Doctor Case, CBI, Supreme Court, RG Kar Medical College: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కోల్‌కత్తా డాక్టర్‌ రేప్‌ అండ్‌ మర్డర్’ కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కేసు డే వన్‌నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

అప్పుడెప్పుడో ఢిల్లీలో జరిగిన నిర్భయ హత్యాచార ఘటనను గుర్తుకు తెస్తూ.. అంత కిరాతకంగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కత్తా మహా నగరంలో మరో హత్యాచార ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నైట్‌ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌ను హాస్పిటల్‌లోనే రేప్‌ చేసి, అత్యంత దారుణంగా హత్య చేశారు. బలవంతంగా లైంగిక దాడి చేసి.. విషయం బయటికి రాకుండా హత్య చేశారా? లేక వేరే ఏదేనా కారణంతో పక్కా పథకం ప్రకారమే హత్య చేశారా? అనే అనుమానాల నడుమ.. ‘కోల్‌కత్తా డాక్టర్‌ రేప్‌ అండ్‌ మర్డర్‌’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ కేసులో తొలి రోజు నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగింది.. పిన్‌ టూ పిన్‌ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆగస్టు 8, గురువారం..

కోల్‌కత్తాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ స్టూడెంట్‌గా ఉన్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌.. ఎమర్జెన్సీ బ్లాక్‌లో విధులకు హాజరైంది. ఆ రోజు ఆమెకు నైట్‌ డ్యూటీ. అదే రోజు రాత్రి 2 గంటల సమయంలో ఎమర్జెన్సీ బ్లాక్‌లోని ఓ సెమినార్‌ హాల్‌లో కాస్త విశ్రాంతి తీసుకునేందుకు ట్రైనీ డాక్టర్‌ వెళ్లింది.

ఆగస్టు 9, శుక్రవారం ఉదయం..

ఉదయం ఆస్పత్రి సిబ్బంది సెమినార్‌ హాల్‌లోకి వెళ్లి చూడగా.. ట్రైనీ డాక్టర్‌ అర్ధనగ్నంగా సెమినార్‌ హాల్‌లో శవమై పడిఉంది. శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. కళ్లు, నోటి నుంచి రక్తం కారుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డాక్టర్‌ తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు ‘అనుమానస్పద మృతి’గా నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని గురించిన తర్వాత.. మూడు గంటల వరకు తల్లిదండ్రులను బాడీని చూసేందుకు అనుమతించలేదు.

నిందితుడి గుర్తింపు..

శుక్రవారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. ఎమర్జెన్సీ బ్లాక్‌ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా.. ఆస్పత్రి ఔట్‌ పోస్ట్‌లో సివిక్‌ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌ రాయ్‌.. అదే రోజు రాత్రి 4 గంటల సమయంలో ఎమర్జెన్సీ బ్లాక్‌లోని సెమినార్‌లోకి వెళ్తున్నట్లు గుర్తించారు. కొద్ది సేపటి తర్వాత అతను బయటికి రావడం కూడా అందులో రికార్డ్‌ అయింది. అలాగే డాక్టర్‌ మృతదేహం పక్కన బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌ దొరికాయి.. అవి సంజయ్‌ ఫోన్‌తో పెయిర్‌ అయి ఉన్నాయి. దీంతో.. సంజయ్‌ రాయ్‌ని నిందితుడిగా అనుమానిస్తూ.. అతని ఇంటికి వెళ్లి పోలీసులు శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్‌లో పోర్న్‌ వీడియోలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.

పోస్టుమార్టం..

శుక్రవారం మధ్యాహ్నం 1.45 నుంచి 4 గంటల వరకు డాక్టర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కళ్లు, నోరు, ప్రైవేట్‌ పార్ట్స్‌ నుంచి బ్లీడింగ్‌ అయినట్లు ఆటోప్సీ(శవపరీక్ష) రిపోర్ట్‌లో వెల్లడైంది. ఆమె ఎడమ కాలు, మెడ, కుడి చేయి, ఉంగరపు వేలు, పెదవులపై కూడా గాయాలు ఉన్నట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

అంత్యక్రియలు..

శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో పోస్టుమార్టం నిర్వహించిన బాడీని.. బాధితురాలి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నకూతర్ని కోల్పోయిన వాళ్లు.. కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ.. డాక్టర్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకంటే ముందే.. ఆస్పత్రిలో డాక్టర్‌ హత్యాచార ఘటన కోల్‌కత్తా అంతా దావానంలా వ్యాపించడంతో నగరంలోని డాక్టర్లంతా నిరసన ప్రదర్శనలకు దిగారు.

ఆలస్యంగా FIR నమోదు..

ఈ దారుణ ఘటనపై పోలీసులు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే.. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అప్పగించిన తర్వాత.. మూడు గంటల తర్వాత కానీ, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తే.. రాత్రి 11.45 నిమిషాలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. ఈ ఆలస్యంపై సుప్రీం కోర్టు కూడా బెంగాల్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఆగస్టు 11, ఆదివారం

ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్త సంచలనంగా మారడం, కాలేజీ ప్రిన్సిపల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. డాక్టర్‌ హత్యాచారానికి గురైన ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ తన పోస్టుకు రాజీనామా చేశారు. అయితే.. రిజైన్‌ చేసే ముందు.. డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఆయన చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. ‘రాత్రి సమయంలో క్యాంపెస్‌లో ఒంటరిగా ఎందుకు తిరగడం’ అంటూ.. ట్రైనీ డాక్టర్‌దే తప్పు అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్‌ నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి.

దేశవ్యాప్త నిరసనలు..

మరో నిర్భయను తలపిస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఓ మహిళా డాక్టర్‌కు రక్షణ లేకపోవడం ఏంటంటూ.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. డాక్టర్లు, సామాన్యులు, మహిళలు, మహిళా సంఘాలు.. బాధితురాలికి న్యాయం జరగాలి, నిందితులకి కఠిన శిక్ష పడాలంటూ రోడ్లపైకి వచ్చేశారు.

150 మిల్లీ గ్రాముల వీర్యం, గ్యాంగ్‌ రేప్‌!

తమ కూతురి పరిస్థితి చూస్తుంటే.. ఇది ఒక్కరు చేసిన పనిలా లేదని, ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి ఈ దారుణానికి తెగబడినట్లు అనుమానిస్తూ.. బాధితురాలి తండ్రి కోల్‌కత్తా కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ క్రమంలోనే డాక్టర్‌ శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు కొన్ని వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే.. అందులో వాస్తం లేదంటూ కోల్‌కత్తా పోలీసులు స్పష్టం చేశారు.

కేసు.. CBIకి ట్రాన్స్‌ఫర్‌..

దేశవ్యాప్త నిరసనలతో ఈ కేసును కోల్‌కత్తా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత.. ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ పోస్టుకు రాజీనామా చేసిన డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ను విచారణకు పిలిచింది. గత నాలుగు రోజులుగా ఆయనను ఏకంగా 53 గంటల పాటు విచారించింది. ఈ ఘటన వెనుక ఆయన హస్తం ఏమైనా ఉందా? మృతదేహాన్ని చూసేందుకు తల్లిదండ్రులను ఆలస్యంగా అనుమతించడం, ఘటన జరిగిన బిల్డింగ్‌లో పర్మిషన్‌ లేకుండా రెన్నోవేషన్‌ పనులు చేయించడంపై సీబీఐ ఆయనను విచారించింది.

నేరం అంగీకరించిన సంజయ్‌ రాయ్‌..

ఈ కేసులో ఆగస్టు 9న అరెస్ట్‌ అయిన సివిక్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌.. తాను హత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకొని.. తనను ఉరి తీయాలంటూ విచారణలో చెప్పినట్లు సమాచారం.

ఆగస్టు 18, ఆదివారం..

ఈ హత్యాచార ఘటనపై దేశం నలుమూల నుంచి పలు పిటిషన్లు రావడంతో.. భారత దేశ అత్యున్నత న్యాయస్థానం ‘కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార’ ఘటనను సుమోటాగా స్వీకరించింది.

ఆగస్టు 20, మంగళవారం..

ఈ ఘటనపై సుప్రీం కోర్టులో చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా డీవై చండ్రచూడ్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం సుమోటోగా తీసుకున్న ఈ కేసును విచారిస్తోంది. ఆస్పత్రిలో సెక్యూరిటీ లోపాలు, బయటి వ్యక్తులను అనుమతించడం, ఆలస్యంగా ఎఫ్‌ఐర్‌ నమోదు చేయడం వంటి విషయాలపై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌ తరఫున ప్రముఖ లాయర్‌ కపిల్‌ సిబాల్‌ వాదిస్తున్నారు. దేశవ్యాప్తంగా వైద్య నిపుణుల భద్రత కోసం అనుసరించాల్సిన పద్ధతులను పరిశీలించడానికి ‘నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌’ను ఏర్పాటు చేసింది. మరి దేశం మొత్తం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments