ట్రాఫిక్ చలాన్ల పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.. అయితే జాగ్రత్త

సాంకేతికత పెరుగుతున్న కొద్ది.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. కేటుగాళ్లు.. రకరకాల మార్గాలను ఎంచుకుని.. జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. మనం బుక్‌ చేయకున్నా సరే.. మన పేరు మీద డెలివరీ వచ్చిందని వస్తారు. మనం బుక్‌ చేయలేదు అంటే.. సరే క్యాన్సిల్‌ చేస్తాము.. ఓటీపీ చెప్పండి అంటారు. అలా చెప్పాము అంటే.. ఇక అంతే సంగతులు. ఇదే కాక.. ఈకేవైసీ, ఖరీదైన గిఫ్ట్‌లు, ఓఎల్‌ఎక్స్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌ యాక్టీవేషన్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిని చూస్తూనే ఉన్నాము. ఇక తాజాగా ఈ మోసాల జాబితాలోకి ట్రాఫిక్‌ చలాన్‌ కూడా చేరింది. ట్రాఫిక్‌ చలాన్‌ కట్టాలంటూ మెసేజ్‌లు పంపుతూ.. బాధితుల ఖాతాల నుంచి డబ్బులు లూటీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఆ వివరాలు..

రోడ్ల మీద వాహనాలతో ప్రయాణం చేస్తున్నప్పుడు.. ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే.. ఫైన్‌ విధిస్తారు పోలీసులు. ఆ తర్వాత.. చలాన్‌కు సంబంధించిన ఫైన్‌ వివరాలను రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌ రూపంలో పంపిస్తుంటారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.. వెహికల్‌పై ట్రాఫిక్ చలాన్లు ఉంటే అప్పటికప్పుడు.. ఆన్‌ ది స్పాట్‌లోనే వాహనదారుల మొబైల్‌కు లింక్ పంపించి డబ్బులు కట్టించుకుంటున్నారు. అయితే దీన్ని అవకాశంగా మలుకున్నారు కొందరు సైబర్‌ కేటుగాళ్లు. ట్రాఫిక్‌ చలాన్‌ పేరు చెప్పి.. జనాలను మోసం చేస్తున్నారు.

ఈ ట్రిక్‌ను వాడుకుని సైబర్‌ నేరగాళ్లు.. జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు పంపించిన విధంగా వాహనదారులకు మేసెజ్‌లు పంపుతున్నారు సైబర్‌ మోసగాళ్లు. ఆ తర్వాత పేమెంట్ చేసుకోవాలంటూ ఓ లింక్‌ను కూడా మొబైల్‌కు సెండ్‌ చేస్తున్నారు. దీన్ని చూడగానే మీరు కంగారు పడి.. ముందు వెనకా ఆలోచించకుండా.. నిజంగానే ట్రాఫిక్ చలాన్ ఉందేమో అనుకుని ఆ లింకును క్లిక్ చేశారా.. ఇక అంతే.. మీ అకౌంట్‌ ఖాళీ అవుతుంది. ఈమధ్య కాలంలో ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయి. దాంతో ఇలాంటి ఫేక్ చలాన్ పేమెంట్ లింకులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ట్రాఫిక్‌ చలాన్‌కు సంబంధించి మీకు ఏమైనా మెసేజ్‌ వస్తే.. మీరు ముందుగా టీఎస్ ఈ చలాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మన వెహికల్ నంబర్ కొట్టగానే ఎన్ని చలానాలు ఉన్నాయో చూపిస్తుంది. నిజంగానే మీ వెహికల్‌ మీద చలాన్‌ ఉంటే.. మీరు అక్కడే పేమెంట్‌ చేయవచ్చు. అందుకే ఇలాంటి లింక్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఏదైనా అనుమానం ఉంటే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.

Show comments