భద్రాద్రిలో విషాదం.. నాలాలో పడి మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

వాతావరణంలో మార్పులు.. అల్పపీడనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పిడుగులు పడి కొందరు, నాలాల్లో పడి మరికొందరు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ ప్రమాదావశాత్తు డ్రైనేజీలో పడి మృతి చెందింది. ఆ జిల్లాలో భారీగా కురిసిన వర్షంతో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే మహిళా హెడ్ కానిస్టేబుల్ నాలాలో పడి వరదలో కొట్టుకుపోయి మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా భద్రాచలం వచ్చిన మహిళా హెడ్ కానిస్టేబుల్ రామాలయం ఎదురుగా ఉన్న అన్నదాన సత్రం వద్ద ఉన్న నాలాలో పడి మృతి చెందింది. మృతి చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్ ను శ్రీదేవీగా గుర్తించారు. కాగా ఈమె ప్రస్తుతం కొత్తగూడెంలో విధులు నిర్వహిస్తోంది. అయితే ఈ రోజు భద్రాద్రిలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా డ్యూటీపై భద్రాచలం వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు భద్రాద్రిలో కుండపోత వర్షం కురిసింది.

ఈ క్రమంలో విధులు పూర్తైన తర్వాత హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనానంతరం అన్నదాన సత్రంలో భోజనం చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే సత్రం ఎదురుగా ఉన్న నాలాలో పడి వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నాలాలో మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఈ విషాద వార్త తెలియగానే తోటి ఉద్యోగులు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Show comments