Dharani
Dharani
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు అనగా.. సెప్టెంబర్ 15, శుక్రవారం విచారణ హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితుడగా ఉన్న రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారడంతో మరోసారి కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే తాను కవితకు బినామీ అని గతంలో అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అతను అప్రూవర్‌గా మారడంతో.. మరోసారి కవితకు నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు అప్రూవర్‌లుగా మారారు. వారు శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ ఆరోరా, రామచంద్ర పిళ్లై. ఇక తాజాగా రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారడంతో.. ఈడీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలో కవిత విచారణ కీలకంగా మారనుంది. ఇప్పటికే ఈడీ ఈ ఏడాది మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు రోజుల పాటు కవితను రోజంతా విచారించిన సంగతి తెలిసిందే. ఇక రేపు మరోసారి విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కవిత.. రేపు విచారణకు హాజరు అవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. అయితే ఆమె రేపు విచారణకు హాజరయ్యేది అనుమానంగానే ఉంది.