Crime News: సంసారంలో గొడవలు.. నలుగురు పిల్లల్ని కాలువలోకి పడేసిన తల్లి

సంసారంలో గొడవలు.. నలుగురు పిల్లల్ని కాలువలోకి పడేసిన తల్లి

భార్యా భర్తల మధ్య గొడవలకు పిల్లలు బలౌతున్నారు. దంపతులు ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడల్లా.. ఆ కోపాన్ని పిల్లల మీద ప్రదర్శిస్తుంటారు తల్లిదండ్రులు. వారిని అకారణంగా తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. పిల్లల ముందు వాదులాడుకోకూడదన్న ఇంగిత జ్ఞానాన్ని మరచి ప్రవర్తించారు. ఎవరైనా ప్రశ్నిస్తే ‘ మా పిల్లలు మా ఇష్టం, కొడతాం, తిడతాం. అవసరమైతే చంపేసుకుంటాం’, మీరెవ్వరూ మాకు చెప్పడానికి వచ్చారు అంటూ  కస్సుబుస్సులాడుతుంటారు. కోపంలో చెప్పే ఈ మాటలను నిజం చేసి చూపించింది ఆ కసాయి తల్లి. ఏ బాధ వచ్చినా పిల్లల్ని కడుపున పెట్టుకుని చూసుకునేది మాతృమూర్తే,  అలాంటిది తల్లి అనే పదానికి మచ్చను తెస్తూ పిల్లల్ని చంపి, తాను ఆత్మహత్యకు యత్నించింది ఓ మహిళ. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మంగనూరు గ్రామానికి చెందిన శరవంద, ఎర్రగుంట తండాకు చెందిన లలితది ప్రేమ వివాహం. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి రత్నాల్లాంటి ముగ్గురు ఆడపిల్లలు మహాలక్షి (5), సాత్విక (4), మంజుల (3)తో పాటు మార్కండేయ (7 నెలల) అనే బాబు ఉన్నారు. కాగా, భార్య భర్తల మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాను కల్లు తెచ్చుకుంటానని లలిత భర్తను అడిగితే.. అతను వద్దని వారించాడు. దీంతో మనస్థాపానికి గురైన భార్య లలిత.. భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తన నలుగురు పిల్లలతో సహా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు.

కంప్లైంట్ తీసుకునే అధికారి రాలేదని కాసేపు ఆగాలని లలితకు చెప్పి కూర్చొబెట్టారు. అయితే పిల్లలకు ఆకలితో అలమటిస్తున్నారని, తాను టిఫిన్ చేసి, వారికి తినిపించి వస్తానని వెళ్లింది. బయటకు వెళ్లాక .. స్టేషన్‌కు కొద్ది దూరంలో ఉన్న కేఎల్ఐ కాలువ దగ్గరికి వెళ్లి, నలుగురు పిల్లలను నీళ్లల్లోకి పడేసి, తాను దూకేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. పిల్లలను కాపాడేందుకు కాల్వలోకి దూకగా..ఫలితం లేకుండా పోయింది. ముగ్గురు ఆడపిల్లలు మరణించగా.. ఏడు నెలల బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు లలితను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Show comments