iDreamPost
android-app
ios-app

చిత్ర పరిశ్రమలో కలకలం.. బయటపడ్డ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌!

చిత్ర పరిశ్రమలో కలకలం.. బయటపడ్డ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌!

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో బెట్టింగ్‌ యాప్‌ స్కాం కలకలం రేపుతోంది. మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ మాటున జరుగుతున్న స్కాం తాజాగా వెలుగులోకి వచ్చింది. యాప్‌ ముసుగులో హవాలా మార్గంలో భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తున్నట్లు ఈడీ అధికారులు కనుగొన్నారు. శుక్రవారం 417 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ సీజ్‌ చేసింది. ఇక, ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఈ బెట్టింగ్‌ యాప్‌ నిర్వహకుడి పెళ్లికి ఆ బాలీవుడ్‌ ప్రముఖులు హాజరవ్వటంతో అధికారులు వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు వారికి ఈడీ సమన్లు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రకర్‌ వివాహం కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్‌ నుంచి టైగర్‌ ష్రాఫ్‌, సన్నీ లియోన్‌, నేహా కక్కర్‌, అతిప్‌ అస్లమ్‌, రహత్‌ ఫతేహ అలీ ఖాన్‌, అలీ అస్గర్‌, విశాల్‌ దద్లానీ తదితరులు హాజరయ్యారు. దుబాయ్‌లో జరిగిన ఈ పెళ్లికి వీరిని తీసుకెళ్లటం కోసం ఓ ప్రైవేట్‌ జెట్‌ కూడా ఏర్పాటు చేసినట్లు మీడియా కథనం.

కేవలం ఈవెంట్‌ కోసమే హవాలా మార్గం ద్వారా 112 కోట్లు రూపాయలు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. అంతేకాదు! హోటల్‌ గదుల కోసం 42 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడైంది. మరో నిర్వాహకుడు అయిన ఉప్పల్‌ రవి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి కూడా బాలీవుడ్‌ సెలెబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. హవాలా మార్గంలో వచ్చిన సొమ్మునే ఈవెంట్ల కోసం చెల్లించినట్లు ఈడీ దర్యాప్తులో తెలియవచ్చింది. ఈ నేపథ్యంలోనే మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరైన బాలీవుడ్‌ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని భొగట్టా..