Dharani
Dharani
ఆ దంపతులిద్దరూ తీవ్ర గాయాలతో ఒళ్లంతా రక్తసిక్తమయ్యి రోడ్డు మీద పడి ఉన్నారు. మరి కాసేపట్లో తాను మరణిస్తానని అతడికి అర్థం అయ్యిది. చనిపోయే ఆ చివరి నిమిషంలో కూడా అతడు తన గరించి కాకుండా.. తన భార్యాబిడ్డల గురించి ఆలోచించాడు. తాను లేకపోయినా.. కనీసం భార్య అయినా ప్రాణాలతో ఉంటే.. చాలనుకున్నాడు. గాయాల నొప్పిని భరిస్తూ.. రక్తమోడుతున్నా లెక్క చేయకుండా.. ప్రాణం పోతున్న స్థితిలో కూడా పాక్కుంటూ భార్య వద్దకు వెళ్లి కడసారి ఆమెను హత్తుకున్నాడు. నీకేం కాదు.. నువ్వు ధైర్యంగా ఉండు.. బిడ్డలు జాగ్రత్త.. అంటూ ధైర్యం చెప్పాడు.. అన్నా తనను కాపాడండి అంటూ వేడుకున్నాడు. ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టిస్తోన్న ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిరణ్ కుమార్, తన భార్య అనితను సోమలదొడ్డి క్రాస్ వద్ద ఉన్న బస్ స్టాప్ దగ్గర దించేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కిరణ్ కుమార్ ప్రయాణం చేస్తోన్న బైక్ అదుపుతప్పి కింద పడింది. ఇంతలోనే వారి బైక్ వెనుక నుంచి వస్తున్న లారీ.. కానిస్టేబుల్ కిరణ్ కుమార్, అనిత దంపతుల మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కిరణ్ కుమార్ రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అవ్వడంతోపాటు తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడి భార్య అనితకు కూడా గాయాలు అయ్యాయి.
రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యి తీవ్ర గాయాల పాలైన కిరణ్ కుమార్ ప్రాణం పోతున్న పరిస్థితిలో కూడా తన భార్యకు ఏం జరిగిందోనని ఆందోళన చెందాడు. గాయాలతో ఉన్నా సరే.. నొప్పిని పంటి బిగువున భరిస్తూ పాక్కుంటూ వెళ్లి భార్య అనితను హత్తుకుని.. ఏం కాదు.. ధైర్యంగా ఉండమని ఆమెను సముదాయించాడు. ప్రాణం పోయే స్థితిలో కూడా భార్యాబిడ్డల గురించే ఆలోచించిన అతడిని చూస్తే బాధతో గుండెలో మెలిపెట్టినట్లు అవుతుంది. రోడ్డు మీద ఇంత పెద్ద ప్రమాదం జరిగితే.. ఆ పక్క నుంచి పోయేవారు చోద్యం చూడసాగారు కానీ.. దగ్గరకు వచ్చి సాయం చేయలేదు. ఇక కొందరైతే వీడియోలు, ఫొటోలు తీయడంలో బిజీ అయ్యారు.
కాసేపటి తర్వాత గాయపడ్డ కిరణ్ కుమార్, అనిత దంపతులను స్థానిక ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య అనిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించారు. అయితే దురదృష్టవశాత్తు.. మార్గం మధ్యలోనే కిరణ్‌కుమార్ ప్రాణాలు విడిచారు. ఆయన భార్య అనిత సైతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. తను చనిపోతున్నానని తెలిసి కూడా భార్యకు ధైర్యంగా ఉండమని దగ్గరికి తీసుకొని హత్తుకుని సముదాయించడం ప్రతి ఒక్కరి గుండెను పిండేయగా.. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స సమయంలో తమను కాపాడాలంటూ కిరణ్ కుమార్ ఉన్నతాధికారులను వేడుకున్న తీరు కంటతడి పెట్టిస్తోంది.
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తోన్న సమయంలో కిరణ్ తన బాధను వ్యక్తం చేశారు. ‘అన్నా ఈ ఒక్కసారి నా ప్రాణాలు కాపాడన్నా.. అన్నా మమ్మల్ని బతికించు అన్నా.. పిల్లలున్నారు..’ అంటూ వేడుకున్న తీరు గుండెలను పిండేసింది. కిరణ్ పరిస్థితి చూసి తోటి పోలీసులు కంట తడిపెట్టుకున్నారు. చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కిరణ్ భార్య క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. అనితకు కూడా ఏమైనా అయితే చిన్న పిల్లలు ఇద్దరూ అనాథలవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.