TCS కీలక నిర్ణయం.. ఇక నుంచి వర్క్ ఫ్రం ఆఫీసే.. వారందరికీ ఉద్యోగాలు!

దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించిన టీసీఎస్ ఇకపై దానిని పూర్తిగా ఎత్తేస్తున్నట్లు స్పష్టం చేసింది. సంస్థలో పనిచేస్తున్న ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఇక నుంచి ఆఫీసులకు రావాలని సూచించింది. కరోనా మహమ్మారితో ప్రపంచమే స్థంభించిపోయిన విషయం తెలిసిందే. జనం అంతా ఇండ్లకే పరిమితమై కాలం గడిపిన రోజులవి. ఆ సమయంలో అనేక కంపనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేసేలా ప్రకటన తీసుకొచ్చాయి. తాజాగా వర్క్ ఫ్రం హోంకు స్వస్తి చెప్పిన టీసీఎస్ ఉద్యోగులు అందరూ ఆఫీసుల నుంచే పనిచేయాలని కోరింది. దీనికి సంబంధించి టీసీఎస్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారి మిలింద్ లక్కడ్ వెల్లడించాడు.

ఐటీ దిగ్గజం టీసీఎస్ బుధవారం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికరలాభం 9 శాతం వృద్ధితో రూ.11,342 కోట్లకు చేరగా, ఆదాయం 8 శాతం పెరిగి రూ.59,692 కోట్ల వద్ద నిలిచింది. ఈ సమయంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం పూర్తిగా ఎత్తేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే సమయంలో కొత్త నియామకాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేసింది. తన మొత్తం 6.14 లక్షల మందికిపైగా ఉద్యోగులంతా పూర్తి స్థాయిలో ఇక ఆఫీసులకు వచ్చి పనిచేయాలని కోరింది. సిబ్బంది అంతా కలిసి పనిచేయడం వల్ల ఉత్పాదకత ప్రయోజనాలు ఉంటాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అవసరమని అన్నారు లక్కడ్.

40 వేల మందికి ఆఫర్ లెటర్లు ఇస్తాం!

మిలింద్ లక్కడ్ మీడియాతో మాట్లాడుతూ.. 40 వేల మందికిపైగా ఫ్రెషర్లను ఈ ఆర్థిక సంవత్సరంలో నియమించుకుంటామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. వారందరికీ ఆఫర్ లెటర్స్ ఇస్తామని వెల్లడించారు.

Show comments