iDreamPost
android-app
ios-app

కేంద్రం అద్భుత పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. పూర్తి వివరాలివే

  • Published Aug 10, 2023 | 2:26 PMUpdated Aug 10, 2023 | 2:26 PM
  • Published Aug 10, 2023 | 2:26 PMUpdated Aug 10, 2023 | 2:26 PM
కేంద్రం అద్భుత పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. పూర్తి వివరాలివే

అన్నదాతల ఆదాయాన్ని పెంచేందుకు.. వ్యవసాయానికి అయ్యే ఖర్చును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకుని వస్తున్నాయి. పెట్టుబడి సాయం అందించడమే కాక.. వ్యవసాయ కార్యక్రమాలు, పనిముట్ల మీద కూడా సబ్సిడీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్నదాతకు కేంద్రం శుభవార్త చెప్పింది. సగం ధరకే ట్రాక్టర్‌ అందజేస్తోంది. పీఎం ట్రాక్టర్‌ యోజన స్కీమ్‌ ద్వారా రైతులకు సగం ధరకే ట్రాక్టర్‌ అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్‌లో భాగంగా రైతులు 50 శాతం తక్కువ ధరతో (సబ్సిడీతో) ట్రాక్టర్ కొనుగోలు చేయొచ్చు. ట్రాక్టర్‌ ధర మొత్తంలో.. రైతులు సగం చెల్లిస్తే చాలు. ఈ పథకానికి ఆయా రాష్ట్రాలే నోడల్ ఏజెన్సీగా ఉంటాయి.

ఎవరు అర్హులంటే..

దేశంలో ఉన్న ప్రతి చిన్న, సన్నకారు రైతులందరూ కూడా పీఎం ట్రాక్టర్ యోజన పథకానికి అర్హులే. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రైతు వయస్సు 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులే. అయితే ఈ పథకానికి అప్లై చేసుకునే కౌలు రైతులు.. యజమాని నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది.

వార్షికాదాయం రూ. 1.50 లక్షలు దాటొద్దు!

పీఎం ట్రాక్టర్ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతు కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించొద్దు. 50 శాతం ధరకే ట్రాక్టర్‌ లభిస్తుండగా.. ఆ మొత్తాన్ని కూడా బ్యాంకులు రైతులకు రుణంగా మంజూరు చేస్తాయి.

సబ్సిడీ ఎవరికి వస్తుందంటే?

ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు రైతుకు లోన్ ఇచ్చే బ్యాంకుకే .. కేంద్రం ఈ సబ్సిడీ మొత్తాన్ని బదలాయిస్తుంది. ఉదాహరణకు.. ఒక ట్రాక్టర్ ధర రూ. 8 లక్షలు అనుకుందాం. అందులో కేంద్రం రూ. 4 లక్షలు భరిస్తుంది. మరో రూ. 4 లక్షలు బ్యాంకు రైతుకు రుణంగా ఇస్తుంది. రైతు ట్రాక్టర్ కొన్న తర్వాత.. రైతు తాను లోన్‌గా తీసుకున్న రూ. 4 లక్షలను ఈఎంఐ రూపంలో నిర్ణీత కాల వ్యవధిలో తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.

ఏమేం పత్రాలు కావాలంటే

పీఎం ట్రాక్టర్ పథకానికి దరఖాస్తు చేసే రైతులు కచ్చితంగా వారి ఆధార్ కార్డు, పాన్ కార్డు/ఓటర్ ఐడీ / డ్రైవింగ్ లైసెన్స్/ పాస్‌పోర్టు (వీటిల్లో ఏదో ఒకటి), పొలానికి సంబంధించిన అడంగల్ డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్‌బుకు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను సమర్పించాల్సి ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి..

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు పద్దతుల్లో ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు అవకాశాలున్నాయి. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఇక తెలంగాణలో అయితే .. కామన్ సర్వీస్ సెంటర్లలో (మీసేవా కేంద్రాలు) దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు అతడు ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లోని అధికారులను సంప్రదిస్తే ఈ పథకానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి.

ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలంటే..

ఆన్‌లైన్‌లో ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలంటే.. ముందుగా కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ వెబ్‌సైట్లో https://pmkisan.gov.in/ ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. దీని కోసం ముందుగా లాగిన్‌ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ తర్వాత.. అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఏమైనా అనుమానాలు ఉంటే.. రైతుల కోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ నంబర్ ఉంటుంది. 155261 / 011-24300606 నంబర్స్‌కు ఫోన్ చేసి సందేహాలు తీర్చుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

ఇదే పథకాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో అడుగు ముందుకేసి వినూత్నంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్.. యంత్రలక్ష్మి పేరుతో అమలు చేస్తుండటమేకాక.. ఈ పథకం కింద కేవలం ట్రాక్టర్ మాత్రమే కాక మిగతా వ్యవసాయ పరికరాలు కూడా అదనంగా ఇస్తోంది. మరోవైపు ఏపీ సర్కార్.. వైయస్‌ఆర్ యంత్రసేవ పేరిట అమలు చేస్తోంది. ఈ పథకం కోసం 155251 టోల్‌ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంది. మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి