Dharani
భారీ వర్షాలు, వరదల వల్ల కార్లకు నష్టం వాటిల్లితే.. వాటికి బీమా కవరేజ్ వర్తిస్తుందా.. ఒకవేళ వర్తిస్తే.. దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే వివరాలు మీకోసం..
భారీ వర్షాలు, వరదల వల్ల కార్లకు నష్టం వాటిల్లితే.. వాటికి బీమా కవరేజ్ వర్తిస్తుందా.. ఒకవేళ వర్తిస్తే.. దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే వివరాలు మీకోసం..
Dharani
మిచాంగ్ తుపాను తమళినాడును మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ లోని కొన్న జిల్లాలను కూడా అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, వరదలతో చెన్నై నగరం అతలాకుతలమయ్యింది. అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావడంతో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇక చెన్నైలో వరద నీటిలో కొట్టుకుపోతున్న కార్ల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. మన దగ్గరనే కాదు వరదలు వచ్చినప్పుడు.. ఏదో ఒక చోట ఇలా వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోయే వీడియోలు అనేకం వెలుగులోకి వస్తాయి. మరి ఇలా ప్రకృతి వైపరీత్యం వల్ల వాహనాలు అనగా కార్లు పాడైతే.. ఆ నష్టాన్ని బీమా పాలసీ కవర్ చేస్తుందా? లేదా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వరదలు, తుఫానులు లేదా భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల వాహనాలకు అనగా కార్లకు నష్టం వాటిల్లితే.. అలాంటి వాటికి కూడా మన దేశంలో బీమా కవరేజీ అందించే పాలసీలు ఉన్నాయి. ఇందుకోసం కంపెనీలు కారు ఇన్సురెన్స్ పాలసీలను తీసుకువచ్చాయి. యాక్సిడెంట్లు, అగ్నిప్రమాదాలు, మానవ నిర్మిత విపత్తులు, దొంగతనం వంటి ఇతర ప్రమాదాలతో పాటు వరదలు, భూకంపాలు, తుఫానులతో సహా మరే ఇతర ప్రకృతి వైపరీత్యాల ఫలితంగానైనా సరే మీ వాహనానికి జరిగే నష్టాలను ఈ పాలసీ కవర్ చేస్తుంది.
కారు బీమా పాలసీని తీసుకోవాలని భావించినప్పుడు.. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతాలలో పాలసీ నిబంధనలు, షరతులు అనేవి ఎలా ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం అంటున్నారు. వరద కవరేజ్ లేదా హైడ్రోస్టాటిక్ లాక్ కవరేజ్ (ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్) వంటివి మీ ప్రాంతంలో సాధారణమైన ప్రకృతి వైపరీత్యాల రకాలకు నిర్దిష్ట కవరేజీని కలిగి ఉందా లేదా అన్నది నిర్ధారించుకోవాలి అని సూచిస్తున్నారు. వర్షపు నీరు లేదా వరద నీరు మొదలైన వాటి వల్ల వాహనానికి కలిగే నష్టానికి మనం ఇంజిన్ ప్రొటెక్టర్ యాడ్-ఆన్ ఇన్సూరెన్స్ లేదా సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ వాహానాలకు నష్టం కలిగినప్పుడు బీమాను క్లెయిమ్ చేయాలనుకుంటే.. నష్టానికి సంబంధించిన సాక్ష్యాలను (ఫొటోలు, వీడియోలు, వార్తా కథనాల ద్వారా) సేకరించడం, సంఘటన స్థలం నుంచి కారును తరలించకపోవడం, వెంటనే మీ బీమా సంస్థను సంప్రదించడం వంటివి చేయాల్సి ఉంటుంది. బీమా సంస్థ నష్టాన్ని అంచనా వేయడానికి ఒక సర్వేయర్‌ను పంపుతుంది. వారి నివేదిక ఆధారంగా బీమా సంస్థ క్లెయిమ్‌ను ఆమోదిస్తుంది. మీ బీమా ప్రొవైడర్, మీ పాలసీ స్వభావాన్ని బట్టి క్లెయిమ్ సెటిల్‌మెంట్ల కోసం నగదు రహిత, రీయింబర్స్‌మెంట్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
అంతేకాకుండా, ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతంలో నివసించడం వల్ల మీ కారు బీమా కవరేజీని మెరుగుపరచడానికి కొన్ని యాడ్-ఆన్ కవర్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ యాడ్-ఆన్‌లు.. ప్రాథమిక సమగ్ర పాలసీ కింద కవర్ చేయబడని ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే నిర్దిష్ట నష్టాల నుంచి కూడా కాపాడటం కోసం రూపొందించబడిన మార్గాలు. భారతదేశంలోని సమగ్ర కార్ బీమా పాలసీలు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను కవర్ చేస్తాయి. అయితే కవరేజీ పరిధి, బీమాను క్లెయిమ్ చేసే ప్రక్రియ, అదనపు కవరేజీల అవసరం మారవచ్చు. మీ నిర్దిష్ట అవసరాలు, ప్రాంతానికి సరిపోయే విధంగా పాలసీని జాగ్రత్తగా ఎంచుకోవాలి అంటున్నారు నిపుణులు. క్లెయిమ్ ప్రాసెస్ త్వరగా పూర్తయ్యేలా ఉండే పాలసీలను ఎంచుకోవడం మంచిది అంటున్నారు.